TSPSC లో సమూల మార్పులు చేపట్టిన ప్రభుత్వం
హైదరాబాద్: ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా అవసరమైన సంస్కరణలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ప్రవేశపరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పీఎస్సీల పనితీరుపై అధ్యయనం చేసి.. నివేదిక సమర్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని స్పష్టం చేశారు. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తదితర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. TSPSC ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. TSPSCకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.