రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదన్న గవర్నర్
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాష్ట్రప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు రాజ్‌భవన్‌లోనే భద్రత లేదని, కోల్‌కతా పోలీసుల వల్ల తన భద్రతకు ముప్పు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తనకు అనుమానాలు ఉన్నాయని అందకే ఇప్పటికే ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి సమాచారం ఇచ్చినప్పటికీ తన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. రెండురోజుల క్రితం తనను కలిసేందుకు వచ్చిన బీజేపీకి చెందిన సువేందు అధికారిని గవర్నర్‌ను కలవడానికి రాజ్‌భవన్ పోలీసులు అనుమతినివ్వలేదు. దీనిపై సువేందు అధికారి హైకోర్టులో ఫిర్యాదు చేయగా గవర్నర్ అనుమతి ఉంటే పోలీసులు అనుమతించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దీనిపై గవర్నర్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు తన ఆదేశాలను పాటించట్లేదని, తాను అనుమతించిన వ్యక్తులను కూడా అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే తన అధికారిక నివాసం నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు.