ఖైరతాబాద్ గణేష్‌కు గవర్నర్ తమిళిసై తొలిపూజ
తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ చెందిన ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ గణేష్ సంబరాలకు చిరునామాగా నిలిచే ఖైరతాబాద్ గణనాధుడిని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోంచి భారీగా భక్తులు ఏటా వస్తుంటారు. ఇవాళ జరిగిన స్వామి తొలిపూజకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకొని తొలిపూజలు నిర్వహించారు.

గతానికి భిన్నంగా ఈసారి ఖైరతాబాద్ గణేశ్‌ను పూర్తిగా ప్రకృతి ఆధారంగా రూపొందించారు. 50 అడుగులతో మట్టితో స్వామిని తయారు చేశారు. వినాయకుడితోపాటు సుబ్రమణ్యస్వామి, మహాగాయత్రిదేవి కొలువుదీరారు. గణపతి ఉత్సవాలు రెండేళ్ల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గణేష్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఖైరతాబాద్ గణనాథుడ్ని దర్శించుకునేందుకు నగరంలోని భక్తులు ఖైరతాబాద్ రావడంతో రద్దీ పెరిగింది.

ఇక ఖైరతాబాద్ మహాగణేష్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సైతం స్వామి సేవలో పాల్గొన్నారు.


