Home Page SliderTelangana

“రైతులను కాపాడుకునేందుకే ప్రభుత్వ రైతు భరోసా”: డిప్యూటీ సీఎం

తెలంగాణాలో వ్యవసాయ రంగాన్ని, రైతులను కాపాడుకునేందుకే ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన వనరుల శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఉట్నూర్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, పలు జిల్లాల కలెక్టర్లు ,అధికారులు, అదనపు కలెక్టర్లు, శాసనమండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం దృష్ట్యా రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ మేరకు దీనిపై అందరి అభిప్రాయం, సలహాలు, సూచనలు తీసుకొని అన్ని జిల్లాలను క్రోడీకరించి చట్టసభలలో ప్రస్తావనకు తీసుకువస్తామన్నారు. రాష్ట్ర వనరులు, సంపదను ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామన్నారు.కాగా ప్రజలు, రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కష్టార్జితం నుంచి చెల్లించిన పన్ను, వివిధ రంగాల ద్వారా ప్రభుత్వానికి సమకూర్చిన ఆదాయం ద్వారా ప్రజల కష్టానికి న్యాయం చేస్తామని అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతు సంక్షేమం కోసం స్పష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తామన్నారు. రైతు భరోసా పథకంలో రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో నిపుణులు, వివిధ వర్గాల వారి అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకొని రైతు సంక్షేమం దిశగా కృషి చేయడం జరుగుతుందని భట్టి తెలిపారు.