Editorial NewsNews

రైతు బాగు కోసం రైతన్న ప్రభుత్వం

వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత ఆర్థిక సాయం విడుదల
నాలుగేళ్లలో రైతులకు రూ. 1.45 లక్షల కోట్ల సాయం
రాష్ట్రంలో ఏకంగా 166 లక్షల టన్నులకు చేరిన పంట దిగుబడి
కరువు, కుతంత్రానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు
పేదల ప్రభుత్వానికి.. పెత్తందారీల ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఇది
తెనాలి బహిరంగ సభలో సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా నమ్మి రైతన్నకు పెట్టుబడి సాయం రూపంలో ఆర్థిక సాధికారత అందించడమే ధ్యేయంగా మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతన్న విత్తనం నాటిన నాటి నుంచి పంటను మద్ధతు ధరకు అమ్మే వరకు తోడుగా ఉండి రైతు సుభిక్షం కోరుకునే ఏకైక ప్రభుత్వం మనదేనని వివరించారు. వైఎస్సార్ రైతు భరోసా నాలుగో ఏడాది మూడో విడత ఆర్థిక సాయం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. తెనాలిలో నిర్వహించిన ఈ బహిరంగ సభలో సీఎం జగన్ 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మూడో విడత సాయం అందిస్తున్న రూ. 2 వేల మొత్తాన్ని బటన్ నొక్కి లబ్ధి దారుల ఖాతాల్లో జమచేశారు. నాలుగో ఏడాదికి సంబంధించి గత రెండు విడతల్లో రూ. 7,500 … రూ. 4000 ను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. మూడో విడద సాయం కింద రూ. 1090.76 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దీంతో పాటు డిసెంబర్‌లో సంభవించిన మాండూస్ తుఫాన్ కారణంగా నష్ట పోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన వన రైతులకు రూ. 76.99 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ ఆయా రైతుల ఖాతాల్లో జమచేశారు. మూడున్నరేళ్లలో 22 లక్షల రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ సాయం అందించామని వివరించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కార్యక్రమం ద్వారా కోటిన్నర కుంటుంబాలకు మంచి జరుగుతోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో రైతన్నకు రూ. 13, 500 రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల హామీలో పేర్కొన్న రూ. 12, 500 కంటే అదనంగా మరో రూ. 1000 ను అధికారంలోకి వచ్చిన నాటి కచ్ఛితంగా అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద మేలో రూ. 7,500 అక్టోబర్ లో రూ. 4000 ఫిబ్రవరి రూ. 2000 అందిస్తున్నట్లు సీఎం జగన్ బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ రోజు అందించిన సాయంతో కలిపితే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఈ నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ. 54 వేల లబ్ధి చేకూరిందని వివరించారు. వచ్చే ఏడాది అందించే మొత్తం కలిపి ఐదేళ్లలో రూ. 67,500 సాయం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి అందించినట్లు అవుతుందన్నారు. తమ ప్రభుత్వం కేవలం రైతు భరోసా పథకం కోసమే కోసం రూ. 27,062 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. రైతులన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. వ్యవసాయం అంటే రైతుల బాగు కోరడమేనని ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.