BRSకు అండగా నిలిచిన వారికి భవిష్యత్తులో మంచి పదవులు: కేసీఆర్
ములుగు: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి చేయూతను అందించే వారికి భవిష్యత్తులో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. ఈ సందర్భంగా రాజశ్వర్ రెడ్డికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి పనిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ అన్నారు. అన్ని విధాలుగా బీఆర్ఎస్ వారికి అండగా నిలుస్తుందన్నారు. ఆరు మాసాలకే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. జనగామ నియోజకవర్గానికి చెందిన నాయకులు సందీప్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

