తెలంగాణ నుంచి కేదార్ నాథ్ వెళ్లే వారికి గుడ్ న్యూస్..
చార్ ధామ్ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి కేదార్ నాథ్ వెళ్లే టూరిస్టులకు శుభవార్త. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి జ్యోతిర్లింగ క్షేత్రానికి చేరుకున్న వారి కోసం సిద్దిపేటకు చెందిన సేవా సమితి ఫ్రీగా మూడు పూటలా భోజన సౌకర్యం కల్పిస్తోంది. నిత్యం టీ, టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్.. సాయంత్రం స్నాక్స్.. రాత్రి భోజనం వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భక్తులకు అందిస్తోంది. ఉత్తరాఖండ్ సోన్ ప్రయాగ్ సమీపంలో శిరైషి రాంపూర్ మధ్య ఒక శిబిరం.. కేదార్ నాథ్ ఆలయానికి 100 అడుగుల దూరంలో మరో శిబిరాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ సభ్యులతోపాటు మరో 60 మంది సిబ్బంది నిత్యం వివిధ షిఫ్ట్ లలో పని చేస్తుంటారు. ఈ అన్నదాన శిబిరంలో అల్పాహారం, భోజనంతో పాటు రాత్రి పూట విశ్రాంతి తీసుకునేందుకు 100 మందికి వసతి కూడా కల్పిస్తోంది. అంతేకాకుండా కేదార్ నాథ్ వెళ్లిన వారు సాయం పొందేందుకు ఫోన్ నంబర్లను కూడా కేటాయించారు. 9949930005, 9246932267, 9848124031, 9440777741 నంబర్లకు ఫోన్ చేసి కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితి సేవలను పొందవచ్చు.

