“స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్”..రేవంత్ రెడ్డి
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “రాష్ట్రంలోని రైతాంగం నేడు అతి పెద్ద పండుగ జరుపుకుంటోంది. ఎన్నికల సందర్భంగా వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషను అనుగుణంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే… తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. ఎందుకంటే, దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే 31 వేల కోట్లు వెచ్చించి… రైతును రుణ విముక్తుడిని చేస్తున్నాం.

గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నాం.
రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచాం. రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది.
రైతుల పాలిటశాపంగా మారిన ధరణి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగింది. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నాం”. అని పేర్కొన్నారు.

