కుంభమేళా యాత్రీకులకు గుడ్ న్యూస్
దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే.. వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. దాదాపు 300 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. చాలా మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భక్తులకు పోలీసులు సూచినలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రయాగ్‌రాజ్ ఏయిర్ పోర్టు నుంచి త్రివేణి సంగమం వరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎకో టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు, ప్లై ఓలా భాగస్వామ్యంతో ఈ హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. విమానం ద్వారా.. ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే భక్తులు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా త్రివేణి సంగమానికి చేరుకోవడానికి వీలు లేకపోవడంతో హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులో దిగి 23.7 కిలో మీటర్ల దూరంలో ఉన్న త్రివేణి సంగమానికి హెలికాప్టర్‌లో డైరెక్టుగా వెళ్లాలంటే.. ఒక్కో ప్రయాణికుడు రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనే హెలికాప్టర్ ఛార్జీ, బోట్ ట్రాన్స్‌పోర్ట్, ఇతర సేవలు కూడా ఇస్తారు. ఈ హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకోవాలంటే ముందుగానే ఫ్లై ఓలా వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ సేవలు అప్ అండ్ డౌన్ ఉంటాయి. రూ.35 వేలతో టిక్కెట్ బుక్ చేసుకుంటే.. ఎయిర్ పోర్ట్ నుంచి త్రివేణి సంగమానికి తీసుకెళ్లి.. పుణ్యస్నానాలు ఆచరించి, ఇతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి ఎయిర్ పోర్ట్‌కు తీసుకెళ్తారు.