సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు గుడ్‌న్యూస్
తెలంగాణాలో నిన్న 10 వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా..రెండో స్థానంలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. దీంతో సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థలకు మంత్రి హరీశ్ రావు నగదు పురస్కారాలు అందజేస్తామని ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో 10/10 GPA సాధించిన విద్యార్థులకు రూ.10,000 నగదు బహుమతి అందిస్తామన్నారు. అంతేకాకుండా సిద్దిపేట జిల్లాలో 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ స్కూళ్లకు కూడా రూ.25,000 నగదు పురస్కారం ఇస్తామన్నారు. అయితే జూన్ నెల ప్రారంభంలో ఈ నగదు పురస్కారాలను అందించనున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కాగా సిద్దిపేట జిల్లాలో 10/10 GPA సాధించిన 126 మంది విద్యార్థులతోపాటు,100% ఉత్తీర్ణత సాధించిన 219 ప్రభుత్వ స్కూళ్లకు ఈ నగదు పురస్కారం అందనుందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.