పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 50మందికి గాయాలు!
మహారాష్ట్రలో ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఎక్స్‌ప్రెస్ రైలు… గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు చెప్పారు.

గోందియా, గుధ్మా రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సౌత్‌ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ‘ ప్రాథమిక ఆధారాల ప్రకారం భగత్ కి కోథి ఎస్‌ఎఫ్ ఎక్స్‌ప్రెస్ రైలు (20843) లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా రైలు నియంత్రించలేకపోయాడు దాంతో ముందు నిలిపి ఉంచిన గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. దాంతో ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. కొందిరికి స్వల్ప గాయాలు తగిలాయి. ఆందోళనతో బాధపడుతున్న ఒక ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. అని అధికారులు తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ రిలీఫ్ రైలు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైలును అక్కడి నుంచి పంపించారు.

