భద్రాచలం వద్ద పోటెత్తిన గోదావరి…అధికారుల ఆందోళన
ఎగువ నుండి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది. దీనితో అక్కడ మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎగువనున్న ఏటూరు నాగారం, పేరూరు నుండి వరద వస్తూండడంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో గల నిజాంసాగర్, శ్రీరామ్ సాగర్, కడెం, ఎల్లంపల్లి, దిగువ మానేరు, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ వంటి ప్రాజెక్టులు, బ్యారేజిల గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఎగువ నుండి భారీ ప్రవాహం రావడంతో శుక్రవారం 8.43 గంటలకు నీటిమట్టం 53 అడుగులుకు చేరింది. ప్రవాహం 14.32 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ ఉదయానికి నీటిమట్టం మరింత పెరిగి 54.3 అడుగులకు చేరింది. సాయంత్రానికి 55 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీనితో దిగువ ముంపు ప్రాంతాల ప్రజలను దాదాపు 12 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సేవల కోసం హెలికాఫ్టర్ కూడా ఉంచారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా సిద్దంగా ఉంచారు.

