అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలోని ‘ఫ్యూచర్ సిటీ’ లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. 100 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానుండడంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 8 ప్రత్యేక ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు. సదస్సుకు వెళ్లే మార్గాల్లో హోర్డింగులతో పాటు రహదారుల మరమ్మతులు పూర్తయ్యాయి. ముఖ్యంగా, ప్రాంగణంలో సాంకేతిక అంతరాయాలు లేకుండా భూగర్భ డిజిటల్ కనెక్టివిటీని ఏర్పాటు చేసి, 10 జీబీపీఎస్ వేగంతో సుమారు 10 వేల మంది ఏకకాలంలో వినియోగించుకునేలా వైఫై సదుపాయం కల్పించారు. నిరంతరాయ విద్యుత్తు సరఫరా కోసం ప్రత్యేక భూగర్భ లైన్లు, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా డీజీపీ శివధర్‌రెడ్డి స్వయంగా ప్రాంగణాన్ని పరిశీలించి, సుమారు 1,000 సీసీ కెమెరాల అనుసంధానంతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఆదివారం ఉదయం లోపు ‘డ్రై రన్’ నిర్వహించి తుది తనిఖీలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

