NewsTelangana

అనాథ ఆశ్రమంలో బాలికపై లైంగిక దాడి… అకౌంటెంట్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌ నగరంలోని నేరేడ్‌మెట్‌లో దారుణం జరిగింది. జేజేనగర్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉన్న ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగింది. ఈ నెల 19 వ తేదీన ఈ అనాథ ఆశ్రమం నుండి నలుగురు అమ్మాయిలు పారిపోయారు. ఈ ఆశ్రమంలో మొత్తం 35 మంది విద్యార్థినులు ఉన్నారు. అయితే.. నలుగురు విద్యార్థినులు పారిపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సికింద్రాబాద్‌లో ఇద్దరిని, మరో ఇద్దరిని తమ బంధువుల ఇళ్లలో పోలీసులు గుర్తించారు. బాలికలను సఖి సెంటర్‌కు తరలించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అయితే.. తమపై లైంగిక దాడి జరిగిందని కౌన్సిలింగ్‌ సమయంలో ఓ బాధితురాలు తెలిపింది. అనాథ ఆశ్రమంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న మురళి… తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అందుకే తాము పారిపోయామని తెలిపినట్లు సమాచారం. మైనర్‌ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారం ఆధారంగా అకౌంటెంట్‌ మురళిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.