ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీ గిరిధర్ అరమణే?
ఏపీ చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి పేరు ఖరారంటూ వార్తలు వస్తున్న తరుణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమణే పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గిరిధర్ రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తక్షణం గిరిధర్‌ను రిలీవ్ చేసి ఏపీకి పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. తాజాగా గిరిధర్ సీఎం జగన్‌ను కలవడంతో.. కాబోయే సీఎస్ ఆయనేనన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ కేడర్ సీనియార్టీ పరంగా చూసుకుంటే గిరిధర్ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. మరికాసేపట్లో సీఎస్ ప్రకటనపై ఉత్తర్వులు సైతం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ అవుతారు. కొత్తగా సీఎస్‌గా ఎంపికైన వ్యక్తి డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. కొత్త సీఎస్‌గా నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి గిరిధర్ అరమనే. నవంబర్ 1న రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 32 సంవత్సరాల అనుభవంలో, అరమనే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. దీనికి ముందు ఆయన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కేబినెట్ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖలో అన్వేషణ విభాగాన్ని కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీలో తనిఖీలకు ఇన్‌ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అరమనే పట్టణాభివృద్ధి శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, AP స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సెక్రటరీ (ఆర్థిక శాఖ)గా పనిచేశారు. చిత్తూరు, ఖమ్మం జిల్లాల కలెక్టర్, డీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అరమనే హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, మద్రాస్ IIT నుండి ఎంటెక్ చేసారు. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఎకనామిక్స్) కూడా చేశారు.