Home Page SliderNational

గెలిపించిన ‘గిల్‌’ … ఫైనల్స్‌కు ‘గుజరాత్’

ఐపీఎల్ ప్లేఆఫ్స్ యుద్ధంలో గిల్ సమరోత్సాహంతో విజృంభించాడు. గుజరాత్‌ను ఎదురులేని టీమ్‌గా నిలబెడుతూ చెన్నైతో ఫైనల్స్‌కు పరుగులు పెట్టించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్రమోదీ స్టేడియంలో వర్షం తగ్గిన అనంతరం మండే సూర్యుడిలా ప్రత్యర్థి జట్టును బెదరగొట్టాడు స్టార్ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్. ఒంటిచేత్తో అవలీలగా ముంబైపై విజయం సాధించి, గుజరాత్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు. 62 పరుగుల తేడాతో ముంబైపై గెలిచిన గుజరాత్ ఈజీగా ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.

వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా మొదలయ్యింది నిన్నటి మ్యాచ్. టాస్ గెలిచిన ముంబై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. శుభమన్‌గిల్ 60 బంతుల్లో ఏడు ఫోర్లు, 10 సిక్స్‌లు సాధించి 129 పరుగులు చేశాడు. దీనితో ఈ ఐపీఎల్‌లో మూడవ శతకం సాధించి, ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ముంబై టీమ్ ముందు 234 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపారు. ముంబై టీమ్‌కు ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. ముంబై టీమ్ నుండి సూర్య 61, తిలక్ 43, గ్రీన్ 30 రన్స్ సాధించినా ముంబైని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. చివరకు 18.2 ఓవర్లలోనే 171 పరుగులకు ఆలౌట్ అయి చేతులెత్తేశారు. కాగా రేపు ఆదివారం చెన్నై, గుజరాత్ మధ్య ఐపీఎల్ తుది పోరు జరగనుంది.