NationalNews

గులాం నబీ కొత్త పార్టీ.. డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ

కాంగ్రెస్‌కు ఇటీవల గుడ్‌ బై చెప్పిన జమ్మూకశ్మీర్‌కు చెందిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ సోమవారం కొత్త పార్టీని ప్రారంభించారు. ప్రజాస్వామ్యం, శాంతి, స్వాతంత్య్రాన్ని ప్రతిబింబించేలా కొత్త పార్టీకి ‘డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ’ అని పేరు ఖరారు చేశామని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఆజాద్‌ ప్రకటించారు. నీలం, తెలుపు, పసుపు.. మూడు నిలువు రంగులతో పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. కశ్మీర్‌ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ అజెండా అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌కే పరిమితం..

తన పార్టీ ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌కే పరిమితమవుతుందని.. తర్వాత దాన్ని విస్తరించడం గురించి ఆలోచిస్తానని చెప్పారు. తన పార్టీ జెండాలోని పసుపు రంగు కొత్తదనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని.. తెలుపు రంగు శాంతికి చిహ్నమని.. నీలం రంగు స్వేచ్ఛకు, సంద్రంలోని లోతుకు, అందనంత ఎత్తులో ఉండే ఆకాశ వర్ణానికి చిహ్నమని ఆజాద్‌ వివరించారు. కాంగ్రెస్‌ పార్టీతో 52 ఏళ్ల అనుబంధాన్ని ఇటీవల తెంచుకున్న గులాం నబీ ఆజాద్‌ (73).. పార్టీకి రాజీనామా చేసినప్పుడు రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.