Home Page SliderNational

‘వయసును తగ్గిస్తామంటూ రూ.35 కోట్ల స్కాం..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక జంట ఘరానా మోసానికి తెరతీశారు. వయసును తగ్గిస్తామంటూ నమ్మబలికి వందల సంఖ్యలో ప్రజలను మోసం చేశారు. ఏకంగా రూ. 35 కోట్ల స్కాం చేశారు. ఇజ్రాయెల్ నుండి తెప్పించిన ప్రత్యేక మిషన్ ద్వారా 60 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల వారిలా మార్చేస్తామని చెప్పి అనేకమందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజీవ్ కుమార్ దుబే, అతని భార్య రష్మి దుబే కాన్పూర్‌లో ఒక థెరపీ సెంటన్‌ను ఓపెన్ చేశారు. అక్కడ వృద్ధులను యువకులుగా మారుస్తామంటూ ఆక్సిజన్ థెరపీ చేస్తామని, యవ్వనాన్ని తిరిగి తెప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఒక మహిళ రూ.10.75 లక్షలు మోసపోయి వీరిపై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. ఇలాగే వందల సంఖ్యలో ప్రజలు మోసపోయారని, దాదాపు రూ.35 కోట్ల స్కాం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట విదేశాలకు పరారీ అయినట్లు సమాచారం.