గెహ్లాట్‌కు నాయకురాలు సోనియా కాదు, వసుంధరా… బాంబు పేల్చిన పైలట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కి నాయకురాలు సోనియా గాంధీ కాదని, బీజేపీకి చెందిన వసుంధర రాజే అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు ప్రత్యర్థి, సచిన్ పైలట్. కీలక కర్నాటక ఎన్నికలను ఎదుర్కోడానికి ముందు ప్రత్యర్థి గెహ్లాట్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. అశోక్ గెహ్లాట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సచిన్ పైలట్ ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ ఎన్నికలకు ముందు పార్టీ అవకాశాలను దెబ్బతీయొద్దనే, తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం లేదన్నాడు. రాష్ట్రంలో అవినీతిని ఎత్తిచూపేందుకు అజ్మీర్ నుండి జైపూర్ వరకు “జన్ సంఘర్ష్ యాత్ర”ను చేపట్టానన్నాడు. 2020లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన ప్రభుత్వాన్ని రక్షించడంలో సహాయపడ్డారని అశోక్ గెహ్లాట్ గత వారాంతంలో చేసిన వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్ ఇచ్చారు. “ధోల్‌పూర్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న తర్వాత, ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదని, ఆయన నాయకురాలు వసుంధర రాజే అని నేను భావిస్తున్నాను” అంటూ పైలట్ దెప్పిపొడిచాడు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు… బీజేపీ నాయకురాలు తన ప్రభుత్వాన్ని కాపాడిందంటూ గెహ్లాట్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాడని విమర్శలు గుప్పించాడు.

ఆదివారం జరిగిన ర్యాలీలో, ముఖ్యమంత్రి వసుంధర రాజే, మరో ఇద్దరు బీజేపీ నాయకులు తన ప్రభుత్వాన్ని కాపాడటానికి సహాయం చేశారని, బీజేపీలోకి మారడానికి, తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చారని, వారు డబ్బు తిరిగివ్వాలన్నారు గెహ్లాట్. ఈ వ్యాఖ్యలపై పైలట్ మండిపడ్డారు. గెహ్లాట్, సొంత ఎమ్మెల్యేలను అవమానించాడని, ఎన్నికలకు ముందు సొంత పార్టీకి హాని కలిగించాడని పైలట్ ఆరోపించాడు. “పదేపదే అభ్యర్థనలు చేసినా అవినీతికి వ్యతిరేకంగా వసుంధర రాజే ప్రభుత్వంపై ఎందుకు చర్య తీసుకోలేదని ఇప్పుడు అర్థమైంది” అని పైలట్ అన్నాడు. రహస్య అవగాహన కారణంగా అశోక్ గెహ్లాట్ బీజేపీ పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా గెహ్లాట్ తనను దారుణంగా దూషించారన్నాడు. గద్దర్ (ద్రోహి), నీకమ్మ (పనికిరానివాడు), కరోనా అని పిలిచాడని వాపోయాడు. నాపై చాలా అపోహలు, దూషణలు చేశారు. పార్టీని దెబ్బతీయకూడదనుకోవడం వల్ల ఏమీ మాట్లాడలేదని గెహ్లాట్ చెప్పాడు. ఐతే తాను చేపడుతున్న యాత్రతో గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నాడు. ఈ యాత్ర ఎవరికీ వ్యతిరేకం కాదని, అవినీతికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.

రాజస్థాన్‌లో నాయకత్వ మార్పును ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని 2020 తిరుగుబాటును సమర్థించారు. గెహ్లాట్ వర్సెస్ పైలట్ రచ్చ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ తనపై చర్య తీసుకునేలా పైలట్ వ్యవహరిస్తున్నారని… సరైన సమయంలో పార్టీని వీడేందుకు ప్లాన్ చేస్తున్నారని నమ్ముతున్నారు. రాజస్థాన్‌లో 2018లో కాంగ్రెస్ విజయం సాధించిన వెంటనే ముఖ్యమంత్రి పదవిపై గెహ్లాట్-పైలట్ వైరం పెరిగింది. 2020లో పైలట్ తిరుగుబాటు చేసినప్పటికీ… ఢిల్లీ సమీపంలో రోజుల తరబడి క్యాంప్ నిర్వహించినా.. గాంధీల చొరవతో వెనక్కితగ్గాడు. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు గెహ్లాట్‌తో కలిసి ఉండేందుకు నిర్ణయించుకోవడంతో తిరుగుబాటు విఫలమైంది. పైలట్ తిరుగుబాటు సమయంలో 20 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోయాడు. గత సంవత్సరం, గెహ్లాట్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలనే కాంగ్రెస్ చర్యకు నిరసనగా దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజస్థాన్‌లో పైలట్ కు సీఎం పీఠం అప్పగించాలని పార్టీ భావించినా ఆ ప్రయోగం బెడిసికొట్టింది.