ఏపీలో భారీగా పేరుకుపోతున్న చెత్త.. .ప్రభుత్వం ఏం చేస్తోందంటే
అమరావతి : ఏపీలో చెత్త లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఎందుకంటే భారత దేశం మొత్తం చెత్తలో ఏపీ వాటా దాదాపు 15 శాతం ఉందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కలే చెప్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం సంవత్సరానికి సుమారు 2.8 నుండి 4.2 మిలియన్ టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి జరుగుతోందట. ఈ వేస్ట్ ముఖ్యంగా గృహాలు, వాణిజ్యం నుండి వచ్చినవే. ఇక పారిశ్రామిక వ్యర్థాలు తీసుకుంటే మరో 2 మిలియన్ టన్నులు ఉంటుంది. ఈ సర్వే ప్రకారం ప్రధాన నగరాలలోనే రోజుకు గరిష్టంగా 11 వేల టన్నుల పైనే చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనిలో 60 శాతం మాత్రమే ప్రభుత్వం మున్సిపాలిటీ వర్కర్ల ద్వారా సేకరిస్తోంది. దానిలో కేవలం 15 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతుండగా..మిగిలినవి ల్యాండ్ ఫిల్ లలో డంప్ చేస్తున్నారు. దీనివల్ల మెథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు తయారయి, నీరు గాలి కలుషితమవుతోంది. మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందనే ప్రశ్న రావడం సహజం.
ఈ చెత్తను, వ్యర్థాలను తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం వేస్ట్ టు వెల్త్, జీరో వేస్ట్ అనే పథకాలను ప్రకటించింది. దీని ద్వారా రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే 3R సూత్రాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు జరుగుతున్నాయి.
. పారిశ్రామిక వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయని, ఇవి రీసైక్లింగ్ ద్వారా పనికొచ్చేలా చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య పేర్కొన్నారు. త్వరలోనే దీనికోసం జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
. ఏపీలోని మెడ్ టెక్ జోన్ లో జీరో వేస్ట్ ఫిలాసఫీతో ఈ వేస్ట్ మేనేజ్ మెంట్ ఫెసిలిటీ ఇటీవలే ప్రారంభించారు. ఇది వ్యర్థాలను పనికొచ్చే విధంగా మార్చి, ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది.
. స్వచ్ఛ భారత్ మిషన్ -అర్బన్ 2.0 కింద 85 లక్షల పాత డంప్ లు క్లియర్ చేశారు. మరో 20 లక్షలు ఈ ఏడాది చివరి నాటికి క్లియర్ చేస్తారు.
. బయో రీమీడియేషన్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ద్వారా 30 శాతం గ్రీన్ హౌస్ గ్యాస్ లను తగ్గిస్తున్నారు. ఆన్ లైన్ వేస్ట్ మేనేజ్ మెంట్ ఫ్లాట్ ఫాం ద్వారా లిక్విడ్, హేజార్డస్, నాన్ హేజార్డస్ వేస్ట్ ను క్రాడిల్ టు గ్రేవ్ ట్రాక్ చేస్తారు.
. విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు లాంటి నగరాలలో ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించడానికి ‘యాంటీ ప్లాస్టిక్ డ్రైవ్’ చేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం, హోటల్స్ లో డిస్పోజబుల్ సామాగ్రి నిషేధం వంటి చర్యల ద్వారా కృషి చేస్తున్నారు.
. ‘టర్నింగ్ వేస్ట్ ఇన్ టూ వెల్త్’ ద్వారా వ్యవసాయం, డైరీ, ఫౌల్ట్రీ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి బయో గ్యాస్, కంపోస్ట్ తయారు చేస్తామని ఆగస్టులో ప్రకటించారు.
. 3R సూత్రాలను ప్రచారం చేస్తూ ఫారెస్ట్ కన్జర్వేషన్, రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రోత్సాహాలు కల్పిస్తున్నారు. అలాంటి ఇండస్ట్రీలకు గ్రీన్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ – అర్బన్ 2.0 కింద ఈ వేస్ట్ ఫెసిలిటీ ప్రారంభించి బ్లూప్లానెట్ వంటి కంపెనీలు 62.4 కోట్ల ప్రాజెక్టులతో వ్యర్థాలను బయో రీమీడియేషన్ చేస్తున్నాయి.
. APPCB 2030 నాటికి 50 శాతం రీసైక్లింగ్ జరగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలు, పరిశ్రమలు తమ వర్క్ షాప్ లకు, కమిటీలకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. అప్పుడే స్వచ్ఛాంధ్ర కల సాకారమవుతుందని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.