Andhra PradeshHome Page Slider

జగన్‌ పాలనలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయే…

“జగన్‌ పాలనలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు. సీఎం జగన్‌ అధికార వ్యామోహం రాష్ట్రానికి శాపంగా మారిందని, వ్యవస్థలను చంపేసి రివర్స్‌గేర్‌లో నడిపిస్తున్నారని మండిపడ్డారు..అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షోభానికి కారణమైన జగన్‌కు పరిపాలించే అర్హత ఎక్కడిదని నిలదీశారు.

జగన్ ప్రభుత్వ పనితీరుపై మాట్లాడుతూ “ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాటా వేయడం మానేశారు. ఇప్పుడు టమాటా ధరలు పెరగడానికి ఇదే కారణం. ముందు చూపుతో వ్యవహరిస్తే ఈ తిప్పలు ఉండేవి కావు. కరోనా సమయంలో రైతు ఒక్కడే బయటకొచ్చి దేశానికి అన్నం పెట్టాడు. రాష్ట్రంలో ప్రస్తుతం 93శాతం మంది రైతులు అప్పులపాలయ్యారు. రైతుపై సగటు అప్పు రూ.2.45లక్షలపైనే ఉంది. తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్‌ సిద్ధహస్తుడు..రాష్ట్రంలో భూసార పరీక్షలు లేకపోవడంతో పంట దిగుబడి తగ్గింది. నీటి సెస్సు వెయ్యి లీటర్లకు రూ.12 నుంచి రూ.120 చేశారు. కృష్ణా-గోదావరి నదులున్న ఈ రాష్ట్రంలో నీటిపై విపరీతమైన సెస్సులా? రాజధాని రైతుల భూమి వేరొకరికి దానం చేసిన జగన్‌ దానకర్ణుడా? అంత దానం చేసే గుణమే ఉంటే తన భూమి ఇవ్వొచ్చుగా? ఆర్‌-5జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి కోర్టు అనుమతి వచ్చిందా? ఏపీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అమరావతి రైతులపై జగన్‌కు ఎందుకంత కక్ష?”అని చంద్రబాబు మండిపడ్డారు. హయాంలో రాయలసీమలో హార్టికల్చర్‌.. కోస్తాలో ఆక్వాకల్చర్‌కు ప్రాధాన్యమిచ్చాం. ఇప్పుడు ఆ రెండూ సంక్షోభంలో ఉన్నాయి. ఏపీలో భూముల ధరలు, వ్యవసాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కామెంట్లు చేస్తున్నారు. వరి రైతుకు గిట్టుబాటు ధర లేదు” అంటూ మండిపడ్డారు చంద్రబాబు.