‘గంగా విలాస్’కు సర్వం సిద్ధం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన విలాసవంతమైన ‘గంగా విలాస్ క్రూయిజ్’ ప్రయాణానికి సర్వం సిద్ధమవుతోంది. జనవరి 13 వ తేదీన ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఇది వారణాసి నుండి బయలుదేరి దిబ్రూఘర్‌ను 51 రోజులలో చేరుకుంటుంది. ఈ క్రూయిజ్ బంగ్లాదేశ్ మరియు భారత్‌లలో 27 నదులపై ప్రయాణిస్తుంది. దాదాపు 3,200 కిలోమీటర్ల మేర దీని ప్రయాణం కొనసాగుతుంది. మొదటి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు ‘గంగావిలాస్’లో ప్రయాణం చేస్తారు.

ఈ రోజు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, ఈ క్రూయిజ్ భారత సాంస్కృతిక, వారసత్వ మూలాలను అనుసంధానం చేస్తుందని పేర్కొన్నారు. అంతే కాక ప్రకృతి వైవిధ్యం, అందాలను తిలకించే అరుదైన అవకాశం అంటూ వర్ణించారు.
దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్భానంద సోనోవాల్ కూడా ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇది జాతీయ పార్కులు, నదీ ఘాట్‌లు, వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్ ఢాకా,జార్ఖండ్ వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించబోతోంది.