కంచి కామకోటి పీఠాధిపతిగా తెలుగు తేజం
కంచి కామకోటి పీఠాధిపతిగా ఎంపికవడం అంటే మామూలు విషయం కాదు. అత్యంత పవిత్రమైన, ప్రతిష్టాత్మమైన ఈ పీఠాధిపతి హోదా మాత్రమే కాదు. ఎంతో బాధ్యతతో కూడుకున్నది. సాక్షాత్తూ జగద్గురు శంకరాచార్య స్థాపించిన ఈ పీఠాధిపత్యం పొందడం అంత సులువు కాదు. ఇప్పుడు 71వ పీఠాధిపతిగా ఏపీలోని అన్నవరానికి చెందిన గణేష్ శర్మ ద్రావిడ్‌ను ఎంపిక చేశారు. ఆయన ఏప్రిల్ 30 నాడు అక్షయతృతీయ సందర్భంగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాకినాడ జిల్లా తునిలో జన్మించిన గణేష్ శర్మ తండ్రి అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో వ్రత పురోహితునిగా పని చేస్తున్నారు. ఆరేళ్ల వయస్సు నుండే వేదాధ్యయనం మొదలుపెట్టిన గణేష్ శర్మ అన్నవరంలోనే కాకుండా, తిరుపతి, అరసవిల్లి, కంచి, బాసర వంటి క్షేత్రాలలో రకరకాల పౌరోహిత్య పాఠాలు నేర్చుకున్నారు. అనేక ఉపనిషత్తులు, వేదాలలో నిష్ణాతులయ్యారు. తెలంగాణలోని బాసర సరస్వతి ఆలయంలో కూడా రుగ్వేద పండితునిగా పనిచేశారు. తరచూ కంచి కామకోటి పీఠానికి వెళ్లి పీఠాధిపతుల వద్ద ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశారు. కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతి కావాలంటే ఘోటక బ్రహ్మచారిగా ఉండాలి, 25 ఏళ్ల వయసులోపే ఉండాలి, వేదాలు చక్కగా నేర్చుకుని ఉండాలి, సన్యాసం స్వీకరించాలి. వీరు ఎంపికైన వెంటనే పీఠాధిపతిగా పనిచేయరు. కొన్నాళ్లపాటు ఉత్తరాధికారిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పీఠాధిపతిగా ఉన్న శంకర విజయేంద్ర సరస్వతి కాలం చేసిన తర్వాతే గణేష్ శర్మ పీఠాధిపతి కాగలుతారు. గణేశ్ శర్మ కంచి కామకోటి పీఠానికి ఎంపిక కావడంపై పలువురు తెలుగు పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.