చుక్కలనంటుతున్న బొజ్జగణపతి విగ్రహాల ధరలు
వినాయకచవితి వస్తోందంటే చాలు దేశమంతా తెగ హడావుడి మొదలవుతుంది. పిల్లలు, పెద్దలూ మాత్రమే కాదు. వీధుల్లో, వాడవాడలా ప్రతీ సెంటర్లలోనూ లంబోదరుడు దర్శనమిస్తాడు. ఆనందోత్సాహాలతో, స్పీకర్లు పెట్టి నానా హంగామా చేసి, ఘనంగా నిమర్జనం జరిగేవరకూ చాలా సందడిగా చేసుకుంటారు దేశ ప్రజలు. అయితే ఈ ఏడాది సంబరాలకు కొంచెం బ్రేకులు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే వినాయక విగ్రహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గుంటూరు దగ్గర సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డు ప్రాంతంలో యువజన సంఘం వారు ప్రతీ సంవత్సరం వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. 2019లో 12 అడుగుల విగ్రహాన్ని 18 వేల రూపాయలకు కొనుగోలు చేసి వేడుకలు చేసారు. గడచిన రెండుసంవత్సరాల కాలం కరోనా కారణంగా అంతగా వేడుకలు జరగకపోవడంతో ఈసారి బాగా చేయాలనే ఉద్దేశ్యంతో విగ్రహం కొనుగోలు చేయాలని గుంటూరుకు వెళ్లి, ధరలు చూసి మూర్చపోయినంత పనయ్యింది వారికి. కారణం 30 వేలు ఖరీదు చేసే విగ్రహం ఈసారి 50 వేల రూపాయలకు తక్కువలేదు.

విగ్రహాల తయారీకి ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఆయిల్, రంగులు, ఇతర అలంకరణ సామాగ్రి ధరలు దాదాపు 50 శాతం పెరిగిపోయాయి. కూలీ రేట్లు కూడా రెండు రెట్లుగా పెరగడంతో వాటన్నింటి ప్రభావం విగ్రహాల ధరలపై పడింది. గతంలో రాజస్తాన్ నుండి వచ్చే కూలీలకు రోజుకూలీ సుమారు 700 రూపాయలు. ఇప్పుడు 1200 రూపాయలకు కూడా ఎవరూ రావడం లేదని వ్యాపారులు చెపుతున్నారు. గతంలో 12 అడుగుల విగ్రహాలు 14 వేల నుండి 20 వేల రూపాయలు ఉంటే, ఇప్పుడు అవే 40 వేల నుండి, 50 వేల రూపాయల ధరలు పలుకుతున్నాయి. అలాగే 14 అడుగుల ఎత్తు విగ్రహాలు గతంలో 50 వేల లోపు ఉంటే ఇప్పుడు దాదాపు లక్ష రూపాయల దాకా ధరలు ఉన్నాయి. దీనితో పుణ్యం, పురుషార్థం కలిసి వస్తాయన్నట్లు కొన్ని ఉత్సవకమిటీలు తక్కువధరకు లభించే మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి, పూజిస్తే అటు ఖర్చు, ఇటు పర్యావరణ హితం కూడా అని ఆలోచనలో పడ్డాయి. సాధారణంగా గుంటూరు జిల్లాలో సుమారు 20 వేల విగ్రహాలు, పల్నాడులో 8 వేల విగ్రహాల వరకూ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.

