మహాగణపతిం.. మనసా స్మరామీ
◆ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వినాయక చవితి వేడుకలు
◆ వినాయకుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
◆ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా పండుగ నిర్వహణ
◆ పందిళ్ళలో వివిధ రూపాల్లో గణనాథులు
◆ సమైక్యతకు చిహ్నంగా గణనాథుడు
◆ కుటుంబాల మధ్య సంబంధాలు బలోపేతం
భారతదేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పందిళ్లలో వివిధ రూపాల్లో గణనాధులను ప్రజలు ప్రతిష్టించారు. కరోనా తీవ్రత తక్కువగా ఉండటం ప్రభుత్వాలు కూడా ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. వినాయకుని ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. వివిధ రూపాల్లో ప్రతిష్టించిన గణనాథుని విగ్రహాలు చూసి ప్రజలు తరిస్తున్నారు. సమాజంలో అనేక కులాలు, మతాలు అభిప్రాయాలు భిన్నంగా ఉన్న ఈ రోజుల్లో వారందరినీ సరైన వేదిక పైకి చేర్చటానికి వినాయక చవితి లాంటి పండుగలు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. కుటుంబమంతా కలిసి జరుపుకునే పండుగ కాబట్టి కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా పెరగటానికి ఈ పండగ దోహదం చేస్తుంది. ఒకప్పుడు ముంబై, హైదరాబాద్ లాంటి మహానగరాలకి చవితి వేడుకలకు ప్రసిద్ధి.

దశాబ్ద కాలంగా ప్రసారమాధ్యమాల ప్రచారం కారణంతో కొన్ని సామాజిక కోణాలు కలిసి ఇప్పుడు వినాయక చవితి వేడుకలు అందరూ సంయుక్తంగా నిర్వహించుకొని ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో చాలా విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. పట్టణాలలో అయితే 90 శాతం మందికి పైగా వేర్వేరు ప్రాంతాల నుంచి వలస వచ్చి నివాసాలు ఉంటారు. వీరి మధ్య పరిచయాలు బాగా ఉండేందుకు అవకాశాలు చాలా తక్కువ. ఇటువంటి వారికి ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి వినాయక చవితి లాంటి వేడుకలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్ల సంస్కృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చవితి వేడుకల నిర్వహణ ఎలా చేద్దామని ఏర్పాటు చేసుకున్న సమావేశాలతో ప్రారంభమవుతున్న ఈ పరిచయాలు, వేడుకలు ముగిసేనాటికి కుటుంబ స్నేహితులుగా మారుతున్నారు. అలా ప్రారంభమైన స్నేహాలు వారి మధ్య అంతరాలు తగ్గించటంతో పాటు ఒకరి సమస్యలు లో ఒకరు భాగం పంచుకునే స్థాయికి ఎదుగుతున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా స్నేహాలు పెరిగేందుకు వినాయక చవితి వేడుకలు వేదికగా మారుతున్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామాల్లో ఒకప్పుడు ఉత్సవాలంటే గ్రామ దేవతకు జరిపే తిరునాళ్ల మాత్రమే. ఆయా సమయాల్లో గ్రామానికి చెందిన వారందరూ ఎక్కడెక్కడ ఏఏ స్థాయిల్లో స్థిరపడినా కూడా తమ తమ సొంతూర్లకు వెళ్లి ఆనందంగా గడిపేవారు. ఇప్పుడు గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించటం సాంప్రదాయంగా మారటంతో ప్రతి వినాయక చవితికి ఎవరెవరు ఎక్కడ ఉన్నా తమ సొంత గ్రామాలకు వచ్చి కుటుంబంతో పండుగను జరుపుకుంటున్నారు. 11 రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న తర్వాత బొజ్జ గణపయ్య నిమజ్జన కార్యక్రమం జరగనుంది.

