టీఆర్‌ఎస్‌కు ‘రోడ్డు రోలర్’ గండం
మునుగోడు, మనసర్కార్: టీఆర్‌ఎస్‌కు మునుగోడు ఉప ఎన్నికలోనూ రోడ్డు రోలర్ గండం తప్పదా.. అనే అనుమానం కలుగుతోంది. అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులతో టీఆర్‌ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కారు గుర్తును పోలిన సింబల్స్‌ను ఇతరులకు కేటాయించొద్దని కోరినా.. ఎన్నికల సంఘం తమకు నష్టం చేసిందంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ గుర్తును నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

కేఏ పాల్‌కు ఉంగరం గుర్తు..
నిజానికి.. రోడ్డు రోలర్‌తో పాటు కెమెరా, చపాతీ రోలర్, డాలీ, సబ్బు డబ్బా, కుట్టు మిషన్, టీవీ, ఓడ గుర్తులు ఈవీఎంలోని స్టాంప్ సైజ్‌లో కారు గుర్తును పోలి ఉన్నాయని, వాటిని ఎవరికీ కేటాయించొద్దని ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్ నాయకులు గతంలోనే కోరారు. ట్రక్కు, ట్రాక్టర్ గుర్తులను మాత్రమే ఎవరికీ కేటాయించని ఈసీ మిగిలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించింది. రోడ్డు రోలర్ గుర్తును ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరగా.. లాటరీ ద్వారా యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్ దక్కించుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు ఉంగరం గుర్తు కేటాయించారు.

నాలుగో నెంబర్‌లో కారు.. ఐదో నెంబర్‌లో రోడ్డు రోలర్
మునుగోడు ఉప ఎన్నికలోని ఈవీఎంలో కారు గుర్తు నాలుగో నెంబర్‌లో ఉంది. ఐదో నెంబర్‌లో రోడ్డు రోలర్ గుర్తు ఉంది. దీంతో కారు గుర్తుకు ఓటు వేయాలనుకునే నిరక్షరాస్యులు, గ్రామీణ ఓటర్లు కారు గుర్తును పోలి.. దాని కిందే ఉన్న రోడ్డు రోలర్ గుర్తు బటన్‌ను పొరపాటున నొక్కే ప్రమాదం ఉందని టీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారు. మునుగోడులో మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 83 మంది నామినేషన్లు ఆమోదం పొందగా.. వీరిలో 36 మంది తమ నామినేషన్లను సోమవారం ఉపసంహరించుకున్నారు. చివరికి బరిలో 47 మంది అభ్యర్థులు మిగిలారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లకే చోటు ఉండటంతో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది.

టీఆర్‌ఎస్ నాయకుల ధర్నా..
2018లో రోడ్డు రోలర్ గుర్తుకు జహీరాబాద్‌లో 4,330 ఓట్లు, డోర్నకల్‌లో 4,117 ఓట్లు, మునుగోడులో 3,569 ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల కెమెరాకు 3-9 వేల ఓట్లు, టీవీకి 2-3 వేల ఓట్లు పోలయ్యాయి. తక్కువ మెజారిటీతో ఫలితం తేలే పరిస్థితుల్లో ఈ గుర్తుల వల్ల తమకు నష్టం కలుగుతుందంటూ టీఆర్‌ఎస్ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. రోడ్డు రోలర్‌తో సహా కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దంటూ చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్ కార్యకర్తలు సోమవారం ధర్నా కూడా చేశారు.

