గజ్వేల్: కుకునూరుపల్లి-రాయవరం ఎన్నికల ప్రచారంలో ఈటల
గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం రాయవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్, గోవా ఎమ్మెల్యే దయానంద్, మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి.
తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ తప్ప తెలంగాణ ప్రజలు కాదు. మనమేం కోటీశ్వరులం కాలేదు అయింది వాళ్ళు.
నరేంద్ర మోడీ గారి అండతో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాము, రేషన్ కార్డులు అందిస్తాము, రూపాయి ఖర్చు లేకుండా ఇంగ్లీష్ మీడియం విద్య, పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందిస్తాము. బిజెపి వస్తే పెన్షన్ పోదు ముసలి వాళ్ళిద్దరికీ పెన్షన్ అందిస్తాము. పోతుందని కెసిఆర్ వచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కడుపు నొప్పి లేస్తే రాయవరంలో టాబ్లెట్ దొరుకుతుందో లేదో కానీ.. కుతిలేస్తే మందు సీసా మాత్రం దొరుకుతుంది. ఎన్ని డబ్బులు వచ్చినా బ్రతకలేకపోవడానికి కారణం.. వచ్చిన డబ్బులన్నీ బ్రాందీ షాప్‌కి పోతున్నాయి.
తాగి తాగి సంసారం అప్పులపాలవుతోంది. పనికిపోయి ఆడవాళ్లు కూడా కష్టం చేయాల్సి వస్తోంది. వాళ్లు సంపాదించి వచ్చిన కూలి పైసలు కూడా తాగుబోతు అయినవాడు లాక్కొని పోతున్నాడు. వద్దురా కొడుకా అంటే అవ్వను, అయ్యను కొట్టి తాగుతున్నారు. తాగి తాగి లివర్ కరాబ్ అయితే అదే భార్య, భర్తకు వైద్యం చేయించుకోవడం కోసం అష్టకష్టాలు పడుతోంది. దేశం మొత్తంలోనే అత్యధికంగా తాగేవాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణలో. బెల్ట్ షాపులు బంద్ చేస్తే రైతుబంధు డబ్బులు, కల్యాణ లక్ష్మి డబ్బులు, పెన్షన్లు రావు. ఆర్థిక మంత్రి హరీష్ రావు వస్తారు అడగండి పుస్తెలతాడు కట్టడానికి రూ.2,500 కోట్లు, పెన్షన్లకు రూ.11 వేల కోట్లు ఇస్తే… తాగి మనం కేసిఆర్‌కి ఇచ్చే డబ్బులు రూ.45,000 కోట్లు. ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఆలోచన చేయండి. నెల రోజులు మనం తాగుడు బందు పెడితే ఖతం అయిపోతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి.. బాగుచేసే బాధ్యత మా బీజేపీకి అప్పగించండి.

