Home Page SliderTelangana

మా కోసం నువ్వు మళ్లీ పుట్టాలి గద్దరన్నా…

ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది. నిత్యం ప్రజల కోసం, బడుగు బలహీనవర్గాల కోసం, పీడిత, తాడిత వర్గాల కోసం పాటుపడిన గుమ్మడి విఠల్ రావు ఉరాఫ్ గద్దర్ గారు ఈరోజు శివైక్యం చెందారు. తాను నమ్మిన సిద్ధాంతం వేలాది మందిని, ఉద్యమాల వైపు నడిపించినా, చివర్లో తాను నమ్మిన సిద్ధాంతం బుల్లెట్ కంటే, బ్యాలెట్ మాత్రమే ప్రజల తలరాతలను మార్చుతుందని… నమ్మిన అతి అరుదైన ఉద్యమ నాయకుడు గద్దర్. తన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకమైన… దేవతారాధనను, తన జీవితచరమాంకంలో… ఎంతటి ఉద్యమకారుడైనా , ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా కనిపించని ఆ అతీత శక్తిని, ఆశ్రయించవలసిందేనని… నమ్మిన ఉద్యమకారుడు, కనపడని ఆధ్యాత్మికవాది శ్రీ గద్దర్ గారు.

గడిచిన 15 సంవత్సరాల పరిచయంలో ప్రతి నిత్యం నా శ్రేయస్సును కాంక్షించారు. తన కుమారుడు సూర్యం ద్వారా, నేను ఆ కుటుంబానికి దగ్గరయ్యాను. అనేక సందర్భాల్లో శ్రీ గద్దర్ గారిని కలుస్తూ, అనేక విషయాలపై చర్చిస్తూ.. అరే నాన్న అని పిలిచిన వ్యక్తి వారు. తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో కుమారుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనుకున్నప్పుడు… తనను నమ్ముకున్న, తనతో ఉద్యమ సహచర్యం చేసిన అనేక మంది అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇంటికి పిలిచి వారితో ప్రజాస్వామ్యం మీద, పార్టీ రాజకీయాలపైనా, తన కుమారుడి రాజకీయంపై నాతో ముచ్చట పెట్టి… సుమారు ఆరు గంటల పాటు చర్చించి, చివరకు తన కుమారుడిని రాజకీయరంగ ప్రవేశం చేయించిన వ్యక్తి శ్రీ గద్దర్.

వెన్నులో బుల్లెట్ తనను నిత్యం ఇబ్బందిపెడుతున్నా, హైదరాబాద్ నగరం దాటి రాలేని పరిస్థితుల్లో నా తమ్ముడి వివాహం కోసం ఒకరోజు ముందుగానే మే 14న నడి ఎండల్లో హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి రెండ్రోజులుపాటు మా ఆతిధ్యం స్వీకరించి, మా ఇంట్లో శుభకార్యానికి హాజరైన వ్యక్తి ఈ రోజు లేకపోవడం నన్నెంతో వేదనకు గురిచేస్తోంది.

చివరిసారిగా కాంగ్రెస్ శాసనసభాపక్షనాయకుడు మల్లు భట్టివిక్రమార్కతో కలిసి సంగీత దర్శకుడు మణిశర్మ గారి ఆఫీసులో వారిని కలిశాను. అప్పుడు కూడా ఆయన సామాజిక, రాజకీయ అంశాలు ఎన్నో నాతో చర్చించారు. కానీ పుట్టినవానికి మరణం తప్పదు. శ్రీ గుమ్మడి విఠల్ గారు ఉరాఫ్ గద్దర్ గారు, ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతించాలని తిరిగి పీడిత తాడిత జనుల కోసం, తిరిగి ఇదే గడ్డపై జన్మించాలని మనసారా కోరుకుంటా…

మీ ఆరా మస్తాన్…