నేడు గడపగడపకు కార్యక్రమం చివరి వర్క్ షాప్
◆ జగన్ చేతిలో ఎమ్మెల్యేల తుది గ్రాఫ్
◆ తుది నివేదికలపై ఎమ్మెల్యేలలో ఉత్కంఠ
◆ ఎమ్మెల్యేల పనితీరును బట్టి టికెట్ల కేటాయింపు
ఏపీలో రాబోవు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరును మెరుగు పరచడంతో పాటు ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా గడపగడపకు కార్యక్రమం ద్వారా చేసిన కసరత్తుల తుది నివేదిక ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ రేపుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకొక్కసారి ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తూ, గడపగడపకు కార్యక్రమాన్ని ప్రధాన ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు ఎమ్మెల్యల పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతలు వ్యతిరేకతలు తదితర అంశాలపై కూడా నివేదికలు తెప్పించుకొని జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే జగన్ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలపై వేగం పెంచారు.

వచ్చే నెలలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహసారధులను నియమించి పార్టీ పరంగా ప్రతి కార్యక్రమంలోనూ వీరిని భాగస్వాములను చేయబోతున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అత్యంత చేరువయ్యి మరల అధికారం పీఠం కైవసం చేసే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఒక్కడినే కష్టపడితే ఫలితం రాదని భావించి తన ఎమ్మెల్యేలను గడపగడపకు కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం మే 11వ తేదీ నుండి ప్రతి గడప ఎమ్మెల్యేలు తిరగాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి శాసనసభ్యుడు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం 96 రోజులైనా ప్రజల్లో ఉండాలని వారంలో ఒక సచివాలయాన్ని తప్పకుండా సందర్శించాలని ఆ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించాలని జగన్ గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం పై ఇప్పటికే నాలుగు సార్లు వర్క్ షాప్ నిర్వహించిన జగన్ నేడు తుది సమీక్షను చేయనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గడిచిన మూడు నెలలుగా గడపగడపకు కార్యక్రమం తీరుపై చర్చించనున్నారు.

సెప్టెంబర్ 28న జరిగిన గత సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరులో తనకు అందిన నివేదికలకు ప్రకారం 27 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని వారు పనితీరు మెరుగు పరుచుకోవాలని పేర్లు కూడా జగన్ చదివి వినిపించారు. అయితే నేడు జరగనున్న సమావేశంలో జగన్ కు అందిన నివేదికల ప్రకారం ఎంతమంది పనితీరు బాగుంది ఏ ఎమ్మెల్యే కి గ్రాఫ్ తగ్గింది అనే అంశంపై సమీక్షలు జరిపి జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. గడపగడపకు నివేదికలతో పాటు ఆ ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో ఎలాంటి సంబంధం పెట్టుకొని ఉన్నారు, జనాదరణ ఎలా ఉంది తదితర అంశాలు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరును బట్టి రానున్న ఎన్నికల్లో తిరిగి టికెట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని పనితీరు మెరుగుపరుచుకొని ఎమ్మెల్యేలు, వెనుకబడ్డ ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టికెట్లు కష్టమేనని వారంటున్నారు.

వచ్చే ఎన్నికలను జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గతంతో పోలిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేక ఓట్లు సాధారణంగానే కొంత ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని ఇలాంటి ప్రతికూల అంశాలు అధిగమించటానికి అభ్యర్థుల మార్పు కూడా అవసరమని భావించిన జగన్ ఎమ్మెల్యేలపై మరింత ఫోకస్ పెట్టి నివేదికలు తెప్పించుకుంటున్నారని ఈ నేపథ్యంలోనే గెలిచే వారికే టికెట్లు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది. ఏదేమైనప్పటికీ శుక్రవారం జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. అధినేత జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వారిలో ఉత్కంఠ గా మారింది. మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాల్సి ఉంది.

