‘కారు’కు అంత్యక్రియలు
‘వెర్రి వెయ్యి విధాలు’. ‘ఎవరి పిచ్చి వారికానందం’. ఇలాంటి మాటలు సరిగ్గా సరిపోతాయి ఈ సంఘటన చూస్తే. 12 ఏళ్లుగా వాడుతున్న ‘వ్యాగనార్ కారు’కు ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు ఒక కుటుంబం. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని పదర్ శింగ అనే గ్రామానికి చెందిన సంజయ్ పొల్లారా అనే వ్యక్తి, అతని కుటుంబం 12 ఏళ్లుగా కారుతో ఉన్న అనుబంధాన్ని మరువలేక, దానిని స్క్రాప్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకే దానిని సమాధి చేద్దామని నిర్ణయించుకున్నారు. దీనితో గురువారం నాడు కారును తమ పొలంలో పాతిపెట్టి, దానికి సమాధి కట్టించారు. ఈ ప్రక్రియ కోసం మత సంప్రదాయాలను అనుసరించి 1500 మందికి భోజనాలు కూడా పెట్టించారు. కారు సమాధికి పూలమాలలు కప్పి అలంకరించారు. ఈ సమాధిపై మొక్కలు నాటుతామని, భవిష్యత్ తరాల వారు ఆ చెట్ల నీడలో సేద తీరాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.


 
							 
							