Breaking Newshome page sliderHome Page SliderNationalNewsviral

ఇక నుంచి ఆన్‌ లైన్లోనే పీఎఫ్ బదిలీ కే సర్టిఫికెట్‌

పీఎఫ్ ఖాతాదారులకు సేవలను సులభతరం చేసేందుకు, మరిన్ని ప్రయోజనాలను అందించేందుకు ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై పీఎఫ్ బదిలీ కే సర్టిఫికెట్ ఆన్‌ లైన్‌ లో పొందవచ్చు. ఇది ఉద్యోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రత్యేక క్లెయిమ్‌లు, 15 రకాల సర్వీసులు ఇప్పుడు కింది స్థాయిలోనే పరిష్కారమవుతాయి. ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారినప్పుడు వారి గత పీఎఫ్ సర్వీసు, పీఎఫ్‌ నిల్వలు కూడా కొత్త కంపెనీలోకి బదిలీ కావాలి. అప్పుడే పింఛను సర్వీసు పెరగడంతోపాటు నిల్వలన్నీ ఒకేచోట ఉంటాయి. దీనికోసం ఈపీఎఫ్‌ఓ బదిలీ సర్టిఫికెట్‌ కే జారీ చేస్తుంది. ఇందులో పీఎఫ్‌ బ్యాలెన్స్, వడ్డీ, ఆ సంస్థలో పూర్తి సర్వీసు, ఉద్యోగ వివరాలన్నీ ఉంటాయి. సాధారణంగా కొత్త సంస్థకు మారినపుడు ఉద్యోగి మెంబరు పోర్టల్‌లో బదిలీ క్లెయిమ్‌ ‘ఫారం 13’ సమర్పించాలి. కొత్త కంపెనీ తొలి చందా జమ చేసే నాటికి ఆటోమేటిక్‌ గా గత సర్వీసు, నిల్వలు బదిలీ అవుతాయి. ఆ తర్వాత పీఎఫ్‌ ట్రస్టు లేదా ఈపీఎఫ్ఓ‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ కే సర్టిఫికేట్‌ జారీ చేస్తుంది. ఇక నుంచి ఈ సర్టిఫికెట్‌ ఆన్‌ లైన్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మెంబర్‌ పోర్టల్‌ లోని ఆన్‌ లైన్‌ సర్వీసుల్లోకి వెళ్లి క్లెయిమ్‌ ట్రాకింగ్‌ లో ‘కే’ సర్టిఫికెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ప్రత్యేక క్లెయిమ్‌ లకు సంబంధించిన ఇప్పటివరకు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ ఆమోదం తెలపాల్సి ఉండగా.. ఇక నుంచి అకౌంట్స్‌ అధికారి, సహాయ పీఎఫ్‌ కమిషనర్‌ స్థాయిలోనే పరిష్కరించేలా కొత్త రూల్‌ తీసుకొచ్చింది. పాత ఈపీఎస్‌ సర్వీసును ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలోని సర్వీసుతో కలపడం, పీఎఫ్‌ అడ్వాన్సుల చెల్లింపులు, వడ్డీ లెక్కింపులో లోపాలు, అదనంగా చెల్లించిన ఈపీఎస్‌ తదితర 15 రకాల సర్వీసులు ఇక నుంచి అకౌంట్స్‌ అధికారి స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లకు కేంద్ర అదనపు పీఎఫ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తుది క్లెయిమ్‌లో పార్ట్‌ పేమెంట్లు చేసేందుకు ఈపీఎఫ్‌ఓ ఓకే చెప్పింది. ఇకపై పూర్తి చందా రాలేదనే కారణంతో క్లైయిమ్స్‌ రిజక్ట్‌ కావు. ఉదాహరణకు ఒక కంపెనీ ఉద్యోగి ఐదేళ్ల సర్వీసుకు మూడేళ్ల పీఎఫ్‌ చందాలనే చెల్లించింది. ఈలోపు ఆ ఉద్యోగి మరో కంపెనీలోకి మారారు. ఐదేళ్ల సర్వీసుకు పూర్తి చందా రాలేదన్న కారణంతో ఈపీఎఫ్‌ అధికారులు క్లెయిమ్‌ తిరస్కరిస్తున్నారు. ఇక నుంచి ఈపీఎఫ్‌ చట్టంలోని ప్రకారం తుది క్లెయిమ్‌ లో పార్ట్‌ పేమెంట్లు చేయనున్నారు. అలాగే మిగతా చందా వసూలు చేసి, ఆ మొత్తాన్ని తుది పేమెంట్‌ కింద ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.