ఇటు నుంచి 786.. అటు నుంచి 1376
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా ఆయా వీసాల కింద భారత్‌లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో పాక్ దేశీయులు భారత్‌ను వీడుతుండగా.. అక్కడ ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇందులోభాగంగా ఏప్రిల్ 24-29 మధ్య పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దు గుండా 786 మంది పాకిస్థానీయులు కార్‌కు వెళ్లగా.. అదే సమయంలో అక్కడినుంచి 1,376మంది భారతీయులు తిరిగి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది. వైద్య వీసాల కింద వచ్చినవారికి ఈనెల 29 వరకు గడువు ఇచ్చింది. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టంచేసింది. దీంతో ఎన్నోఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్న పాక్ పౌరులు తమ కుటుంబాలను వదిలి స్వదేశానికి తిరిగి వెళ్తుండడంతో సరిహద్దుల వల్ల భావోద్వేగ వాతావరణం నెలకొంది. 29తో భారత ప్రభుత్వం అక్కడి పౌరులకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. ఇందులోభాగంగానే సార్క్ వీసా పథకం ద్వారా భారత్‌లో పర్యటిస్తున్న పాక్ వాసుల్ని 48 గంటల్లోగా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.