ఉచితం, అనుచితం.. ఉచితాలతో కాంగ్రెస్ కర్నాటకలో గెలవాలనుకుంటోంది..!
ప్రధాని మోదీ కాంగ్రెస్ ఉచిత హామీలపై విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాలను ఇలా నడపలేమని ప్రధాని ఉద్ఘాటించారు. ‘‘మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను అధికార, అవినీతికి సాధనాలుగా చేసుకున్నాయని, దీన్ని సాధించేందుకు సామ దాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారన్నారు మోదీ. కొన్ని రాజకీయ పార్టీలు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని, కర్నాటక భవిష్యత్ తరం, యువత, మహిళలు ఇది ఆలోచించాలని కోరారు. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

కొన్ని తాత్కాలిక సవాళ్లను పరిష్కరించడానికి, ఉచిత రేషన్, ఉచిత టీకాలు వంటి పేదలకు సాధ్యమైన వాటిన్నింటినీ అందిస్తున్నామని.. కానీ కొందరు మాత్రం ఎన్నికల్లో గెలవడం కోసం ఉచిత హామీలిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. ఆపత్కాలంలో ప్రజలకు సాయం అందించడం ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. అయితే దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఉచితాల సంస్కృతి నుంచి బయటపడాలన్నారు. కర్నాటక ఎన్నికల కోసం, కాంగ్రెస్ అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, బీపీఎల్ కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల బియ్యం (అన్న భాగ్య), ప్రతి కుటుంబానికి చెందిన మహిళకు నెలవారీ ₹ 2,000 (గృహ లక్ష్మి) పథకాలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ యువకులకు ప్రతి నెల ₹ 3,000, డిప్లొమా హోల్డర్‌లకు (18-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు) రెండు సంవత్సరాల పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత ₹ 1,500 భృతి ఇస్తామని పేర్కొంది.

“నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను, కొన్ని పార్టీలు ఉచితాలను పంపిణీ చేయడం ద్వారా మిమ్మల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీ భవిష్యత్తు గురించి మరియు మీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం మీ కర్తవ్యం.” హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఉచితాలతో గట్టెక్కిందన్న మోదీ… రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు ఇప్పటికీ హామీగానే మిగిలి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారెంటీ, బంధుప్రీతి హామీ అని అన్నారు. కాంగ్రెస్ నిజమైన హామీలు ఇవ్వలేని స్థితికి చేరుకుందన్నారు. కాంగ్రెస్ వారెంటీ గడువు ముగిసిందని మీకు తెలుసు, అప్పుడు దాని హామీలకు అర్థం ఏముంటుందన్నారు. అవినీతికి అతిపెద్ద మూలం కాంగ్రెస్, కాబట్టే అవినీతి నిర్మూలనపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. దేశంలో 2014 తర్వాత తన నేతృత్వంలో అవినీతిపై పోరాటంలో వేగం పుంజుకుందని అన్నారు. ‘జన్ ధన్’, ‘ఆధార్’ ‘త్రిశూల్’ అవినీతిపై పెద్ద దాడి చేస్తోందన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (స్కీమ్) మధ్యవర్తుల ద్వారా దోచుకుంటున్న ₹ 2,75,000 కోట్లను ఆదా చేసిందన్నారు. దేశంలో “ఇతర పార్టీల దృష్టి అధికారాన్ని చేజిక్కించుకోవడంపై ఉందని బీజేపీ దృష్టి మాత్రం వచ్చే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చేయడంపై ఉంది.” అని మోదీ చెప్పుకొచ్చారు.

‘కర్ణాటకలో సుస్థిరమైన, మెజారిటీతో కూడిన బీజేపీ ప్రభుత్వం కోసం ప్రజలను ఓట్లు అడగండి, గతంలో రాష్ట్రం ఎదుర్కొన్న అస్థిరత సమస్యలను వారికి అర్థమయ్యేలా చెప్పండి’ అని బీజేపీ కార్యకర్తలకు మోదీ సూచించారు. “డబుల్ ఇంజిన్ గవర్నమెంట్” కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేస్తూ, ఇది అభివృద్ధి వేగాన్ని పెంచుతుందని మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వ పథకాలు విజయవంతం కాకుండా చూసేందుకు, అధికారంలో ఉన్న పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు. ఎందుకంటే అవి విజయవంతమైతే ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందని వారికి భయమన్నారు. రాబోయే 25 సంవత్సరాలలో, “అమృత్ కాల్” “సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశానికి” బీజేపీ హామీ ఇస్తోందన్నారు మోదీ.

