ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు
కర్ణాటక, తెలంగాణలో అమలు చేస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై అధ్యయనాలు మొదలయ్యాయి. ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం వారు తెలంగాణ, కర్ణాటకలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ కీలక హామీని ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మన రాష్ట్రంలో అమలు చేయడానికి తెలంగాణ విధానం సరిపోతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో టిక్కెట్లు జారీ చేస్తారు. ఈ టిక్కెట్ల అసలు ఖరీదును లెక్కించి ప్రభుత్వం నుండి ఆర్టీసీ రీఎంబర్స్ చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకు ఆర్టీసీ ఆదాయం రూ.500 కోట్లు వస్తోంది. అయితే ఈ పథకం అమలు చేస్తే రూ.200 కోట్లు తగ్గుతుందని అంచనా. ఈ నష్టాన్ని ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది. దీనితో ఆర్టీసీ నుండి ప్రస్తుతానికి ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం ఆగిపోవడంతో పాటు మరో రూ.75 కోట్లు చెల్లించవలసి వస్తుంది.

