దావోస్‌లో ట్రంప్ పై ఫ్రాన్స్ నిరసన
గ్రీన్‌లాండ్ అంశంలో ఐరోపా దేశాలు మద్దతివ్వడం లేదన్న అసంతృప్తితో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై ఒత్తిడి పెంచుతున్నట్లు పరిస్థితులు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌పై 200 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన ట్రంప్ వైఖరిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచం నిబంధనల్లేని దశలోకి అడుగుపెడుతోందని మెక్రాన్ హెచ్చరించారు. సుంకాలను ఆయుధాలుగా మార్చి ఐరోపాను అణిచివేయాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలు బలవంతుల ఇష్టానుసారంగా మారుతున్నాయని, సామ్రాజ్యవాద ధోరణులు మళ్లీ తలెత్తుతున్నాయని విమర్శించారు. ట్రంప్ విధిస్తున్న అన్యాయమైన సుంకాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. బెదిరింపుల కంటే గౌరవానికే తాము ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ‘ట్రేడ్ బజూకా’ను అమలు చేయడంలో వెనుకాడొద్దని ఐరోపా కూటమికి పిలుపునిచ్చారు. అలా చేస్తే అమెరికాపై 81 బిలియన్ పౌండ్ల మేర సుంకాలు పడతాయని, ఇది ట్రంప్ వైఖరిని మార్చేందుకు దోహదపడుతుందని మెక్రాన్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ గ్రీన్‌లాండ్ విషయంలో అనుసరిస్తున్న విధానాలను కెనడా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కెనడా ప్రధాని మార్గ్ కార్నీ దావోస్‌లో మాట్లాడుతూ గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. నాటో ఒప్పందంలోని ఆర్టికల్–5ను గుర్తుచేస్తూ.. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే మొత్తం కూటమిపై దాడి చేసినట్లేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దావోస్‌లో ట్రంప్ ప్రసంగానికి ముందే నిరసనలు చోటుచేసుకున్నాయి. పర్వతాలపై ‘నో కింగ్స్’ అనే భారీ బోర్డును ప్రదర్శిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగానే ఈ నిరసనలు చెలరేగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

