NewsTelangana

ఆ నలుగురు మునుగోడుకు దూరంగా కుట్రలో భాగమై..!

Share with

మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా తెలంగాణ అంతట రాజకీయం నరాలు తెగే ఉత్కంఠగా ముందుకు సాగుతోంది. హుజురాబాద్ తర్వాత జరుగుతున్న ఎన్నికలో గెలిచి తీరాలని భావిస్తున్న సీఎం కేసీఆర్… మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో సహా 86 మందిని రంగంలోకి దించారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ పార్టీ గెలుపు కోసం మునుగోడు లో మకాం వేసి మరీ పని చేస్తుంటే ఆ నలుగురు మాత్రం ప్రత్యేక ఎస్సైన్మెంట్లో భాగమైపోయారు. నలుగురు ఎమ్మెల్యేలు మునుగోడుకు దూరంగా… రాజధాని శివారులోని ఫామ్ హౌస్ లో సేదదీరుతున్నారు. పెద్దల నుంచి వస్తున్న ఆదేశాలను పాటించేందుకు సిద్ధమయ్యారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అసలు స్టోరీ లో ప్రధాన పాత్రధారులుగా నిలిచారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు ఉన్న ఫామ్ హౌస్ లో నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యే లు చెబితేనే తాము ఫామ్ హౌస్ కు వచ్చినట్లుగా డిసిపి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. కానీ అది తమ ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ అని అందుకే తాము వచ్చామని మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చాలా స్పష్టంగా మాట్లాడారు. మొత్తం వ్యవహారం అసలు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.

నిందితులను పోలీసులు పట్టుకున్న సందర్భంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియాతో మాట్లాడమని కోరగా నవ్వుతూ వెళ్లిపోయిన వీడియోలు కూడా మనం చూడొచ్చు. నిందితులను పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో రేగా కాంతారావు విక్టరీ సింబల్ చూపించడం కూడా విశేషం.

మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తెలంగాణలో సత్తా చాటాలని బిజెపి భావిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ ఈ కుట్రకు తెరలేపింది. మొత్తం వ్యవహారాన్ని గమనించిన బిజెపి నేతలు అసలు ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. ఇదంతా కూడా టిఆర్ఎస్ పార్టీ ముందస్తు వ్యూహంలో భాగమని తెలుసుకున్నారు.
కుట్రదారులను వెతికే పనిలో పడ్డారు. అలా కూపీ లాగుతున్న సమయంలో టిఆర్ఎస్ నేతలతో కలిసి ఫోటోలు దిగిన నందు కనిపించారు. తాజాగా పోలీసుల అరెస్ట్ చేసిన వారిలో నందు ఉండటంతో మొత్తం వ్యవహారం గుట్టురట్టయింది. కుట్ర కోణం బట్టబయలైంది. టిఆర్ఎస్ పార్టీ నేతలకు అత్యంత సన్నిహితంగా ఉన్న నందు ఫోటోలను చూస్తే ఈ కథ మొత్తం ఎవరి కనుసైగల్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఓవైపు బిజెపి కుట్రను భగ్నం చేశామని టిఆర్ఎస్ పార్టీ చెబుతుంటే అటు పోలీసులు, ఇటు నలుగురు ఎమ్మెల్యే లు చెబుతున్న మాటల్లో పొంతన కనిపించడం లేదు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదుతో తాము వచ్చామని పోలీసులు చెబుతుంటే… అందుకు భిన్నంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియా ప్రకటన కనిపిస్తోంది. తాము ఫ్రెండ్ ఫార్మ్ హౌస్ కు వచ్చినట్లుగా ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల ట్రాప్ తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల ట్రాప్ వ్యవహారం తమకు తెలియదన్నారు. ఫామ్ హౌస్ కు రావడానికి కారణం ఏమని అడిగ్గా… ఫ్రెండ్ ది కాబట్టి వచ్చామన్నారు. ఏమడిగిన ముక్తసరిగా తెలియదని సమాధానం ఇచ్చారు. అందరూ మునుగోడు లో బిజీగా ఉన్నారని అడగ్గా తర్వాత మాట్లాడతా అంటూ మాట దాటవేశారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

అసలు మొత్తం ఏం జరిగిందనేది ప్రజలకు చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. డెక్కన్ కిచెన్, ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు నిందితుల కాల్ రికార్డ్ లు విడుదల చేయాలంటున్నారు. పోలీసులు ఎమ్మెల్యేల స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదని…గన్మెన్లు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నిస్తున్నారు. ఫాంహౌస్ లో పట్టుబడ్డ ఎమ్మెల్యేలను విచారించకుండా పంపించి వేయడం సమంజసమేనా అని నిలదీస్తున్నారు.