బ్యాంక్ ఖాతాలకు నలుగురు నామినీలు
. నవంబర్ 1 నుంచి కొత్త నియమాలు
. కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత.
. బ్యాంక్ ఖాతా మూసివేతలో సులభతరం.
. చట్టపరమైన క్లారిటీ
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రభుత్వం తాజాగా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మార్పుల ప్రకారం, 2025 నవంబర్ 1 నుండి బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి ఖాతాలకు గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకునే అవకాశం లభించనుంది. ఇప్పటి వరకు ఒక్క ఖాతాకు ఒకే నామినీని నమోదు చేసుకునే అవకాశం మాత్రమే ఉండేది. మరణానంతరం ఖాతాలోని మొత్తం ఆ ఒక్క నామినీ పేరుతో విడుదల అవుతుండేది. ఈ కారణంగా కొన్ని కుటుంబాల్లో వారసత్వ వివాదాలు చోటుచేసుకునేవి.
భారత్ లోని బ్యాంకులలో దాదాపు రూ.67 వేల కోట్లకు పైగా డబ్బు ఎవ్వరూ వెనక్కి తీసుకోకుండా అన్ క్లైమ్డ్ గా ఉండిపోయింది. ప్రధాన ఖాతాదారులు మరణించిన తర్వాత, కుటుంబసభ్యులు ఆ డబ్బు తీసుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిలో ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలు బ్యాంకులకు సంబంధించిన అన్ని రకాల ఖాతాలకు, డిపాజిట్లకూ, లాకర్లకూ వర్తిస్తాయి.
ఈ నామినీలను రెండు రకాలుగా నిర్ణయించుకోవచ్చు. ఒకేసారి నలుగురు నామినేషన్ లేదా ఒకరి తర్వాత ఒకరు ప్రయారిటీ ప్రకారం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. లాకర్లకు మాత్రం కేవలం ఒకరి తర్వాత ఒకరు అనే పద్దతి వర్తిస్తుంది. నామినీ పేర్లను నమోదు చేసేటప్పుడే వారి ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ కూడా ఇవ్వాలి. దీనితో బ్యాంకులు వారిని సులభంగా సంప్రదించవచ్చు.
నామినీ అనేది ఖాతాదారు మరణించిన తర్వాత బ్యాంకు ఆ మొత్తాన్ని తాత్కాలికంగా అందించే వ్యక్తి. నామినీకి ఆ మొత్తంపై యజమాన హక్కు ఉండదు.నిజమైన వారసులకే ఉంటుంది. ఖాతా కలిగిన వ్యక్తి నామినీలందరికీ ముందుగానే వాటాలు నిర్ణయించవచ్చు.
ప్రధాన నామినీ లేకపోతే తరువాతి నామినీకి హక్కు బదిలీ అవుతుంది. పాత ఖాతాదారులు కూడా తమ నామినీ వివరాలను సవరించుకోవచ్చు. ప్రస్తుతం ఒక్క నామినీ ఉన్నవారు, అవసరమైతే మరో ముగ్గురిని చేర్చుకోవచ్చు. ఖాతాదారు జీవితంలో ఏ దశలోనైనా నామినీ వివరాలను మార్చడం లేదా తొలగించడం సాధ్యం. ఈ నిబంధన అమలులోకి వచ్చాక తప్పకుండా మీ బ్యాంకు ఖాతాలను సరిచూసుకుని నామినీలను నమోదు చేయడం మంచిది. ముఖ్యంగా వీలునామా లేనివారు తప్పకుండా తమ ఖాతాలకు నామినీలను నమోదు చేసుకోవాలి.
ఈ విధానం త్వరలోనే మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలీసీలకు కూడా వర్తిస్తుంది. దీనివల్ల వారసత్వ గొడవలు, చట్టపరమైన సమస్యలు తగ్గుతాయి. క్లెయిం చేసుకోవడం సులభం అవుతుంది.

