Home Page SliderTelangana

రామగుండంలో ఈసారీ సంచలనమేనా!?

అనూహ్య విజయాల ఖిల్లాగా రామగుండానికి పేరుంది. ఇక్కడ్నుంచి స్వతంత్ర అభ్యర్థులు, ప్రధాన పార్టీలకు కొరుకునపడని విధంగా కార్మిక సంఘాల నేతలు ఎమ్మెల్యేగాలుగా విజయాలు సాధించి చరిత్ర సృష్టించారు. గెలిచిన తర్వాత పార్టీలు మారి, జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. సింగరేణి ప్రభావం ఈ నియోజకవర్గంపై ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ఆర్టీసీ చైర్మన్ గా ఉండి ఎన్నికల్లో ఓడిన సోమారపు సత్యనారాయణ ఆ తర్వాత బీజేపీలో చేరి నియోజకవర్గంలో మరోసారి గెలుపు కోసం స్వతంత్ర అభ్యర్థిగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆసారి అది అంత వీజీ కాదనిపిస్తోంది. 2018లో రామగుండం నుంచి కురుగంటి చందర్ ఫార్వార్డ్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోగా, ఆయన ప్రత్యర్థులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుంచి మాజీ శాప్ చైర్మన్ మకన్ సింగ్ ఠాగూర్, బీజేపీ నుంచి జడ్పీటీసీ సంధ్యారాణి పోటీలో నిలిచారు. చతుర్మఖ పోటీలో ఈసారి గెలుపై కాంగ్రెస్ దీమాతో ఉండగా, మరోసారి గెలుపు తనదేనంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్. గతంలో రామగుండం మేడారం రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది.

రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్‌ల సంఖ్య 259. పురుష ఓటర్లు 1,08,233, మహిళా ఓటర్లు 1,06,716 కాగా ట్రాన్స్ జెండర్లు 25 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,14,974 ఉన్నారు. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్‌లో పద్మశాలీలు ప్రముఖంగా ఉన్నారు. వీరి జనాభా మొత్తం ఓటర్లలో 15 శాతం వరకు ఉండగా, మున్నూరు కాపు పదమూడున్నర శాతం వరకు ఉన్నారు. ఇక మాదిగలు 13 శాతం, మాలలు 12 శాతం, ముస్లింలు ఎనిమిదిన్నర శాతం ఉన్నారు. గౌడలు 7 శాతం, గొల్ల-కురుమలు 6 శాతం, విశ్వబ్రాహ్మణలు 5 శాతం, రెడ్డి 5 శాతం, తెనుగు-మురిజార్ 5 శాతం, ఇతరులు 11 శాతం వరకు ఉన్నారు.