లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనలో నలుగురి అరెస్టు
నేడు లోక్‌సభ సమావేశాల సమయంలో హఠాత్తుగా ఇద్దరు దుండగులు దూసుకొచ్చి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన రేగింది. ఈ సంఘటనలో ఇప్పటికే నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇద్దరు దుండుగులు లోక్‌సభలో అరెస్టు చేయగా, మరో ఇద్దరిని పార్లమెంట్ బయట అదుపులోకి తీసుకున్నారు. సందర్శకుల గ్యాలరీ నుండి ఒక వ్యక్తి సభలోకి దూసుకువెళ్లగా, మరో వ్యక్తి తన వద్ద గల టియర్ గ్యాస్‌ను ప్రయోగించాడు. దీనితో అక్కడ అందరూ భయభ్రాంతులవగా స్పీకర్ ఓంబిర్లా వెంటనే సభను వాయిదా వేశారు. అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల మరో ఇద్దరు రంగుల పొగలు వదిలారు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి. జైభీమ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దీనితో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని కూడా అరెస్టు చేశారు. దీనితో లోక్ సభలో భద్రతా వైఫల్యంపై ఎంపీలు ఆందోళనలు చేశారు. ఈ ఘటనపై సమగ్రమైన దర్యాప్తును చేపడతామని, తాను పూర్తి బాధ్యత వహిస్తానని స్పీకర్ ఓంబిర్లా సభికులకు హామీ ఇచ్చారు. నిందితులను అరెస్టు చేశామని, వారి వద్ద వస్తువులు స్వాధీనం చేసుకున్నాం అని, అది సాధారణ గ్యాసే అంటూ పేర్కొన్నారు. వీరు షూస్‌లో గ్యాస్ బంతులను తీసుకువచ్చినట్లు సమాచారం.