మాజీ ప్రధానికి 14 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు, అతని భార్య బుష్రా బీబీకి జైలు శిక్ష విధిస్తూ పాకిస్తాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అల్ ఖాదిర్ కేసులో వీరిద్దరినీ దోషులుగా నిర్థారిస్తూ ఇమ్రాన్‌కు 14 ఏళ్లు, అతని భార్యకు ఏడేళ్లు జైలుశిక్ష విధించారు. అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయమూర్తి తీర్పు వినిపించారు. వీరిద్దరికీ 10 లక్షలు, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించారు. వీరిద్దరితో పాటు మరో ఆరుగురిపైన కూడా నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో 2023లో ఈ కేసు నమోదు చేశారు. లండన్‌లోని పాక్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుండి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లు బ్రిటన్ పాక్‌కు పంపించారు. ఈ సొమ్మును ఇమ్రాన్ దంపతులు వీటిని జాతీయ ఖజానాలో జమ చేయలేదని ఆరోపించారు. ఆయనపై సుమారు 200కు పైగా కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.

