Home Page SliderInternational

విడాకులు తీసుకుంటున్న ఫిన్‌లాండ్ మాజీ ప్రధాని

అతి చిన్న వయసులోనే దేశ అత్యున్నత పదవిని చేపట్టి అందరిచేత ఔరా అనిపించారు ఫిన్‌లాండ్ మాజీ  ప్రధాని సనా మారిన్. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆమె తన వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. ఆమె తన భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం మేమిద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాము. మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉండి..కలిసే పెరిగాము. ఈ విధంగా మేము 19 సంవత్సరాలుగా కలిసే ఉన్నాము. అయితే ఇప్పటికీ మేము మంచి స్నేహితులమే. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఓ కుటుంబంగా ఇప్పటికీ మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తామని సనా మారిన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. అయితే సనా మారిన్ వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ అయిన మార్కస్‌రైకోనెస్‌తో కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. వీరి బంధానికి గుర్తుగా వీరికి ఓ పాప కూడా జన్మించింది. సనా మారిన్ ఫిన్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2020లో వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కాగా పెళ్లి చేసుకున్న 3 ఏళ్లకే వివాహబంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సనా మారిన్ ప్రధానిగా ఉన్న సమయంలో పలు రకాల ఆరోపణలు ఎదుర్కొని.. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయారు.