InternationalNews Alert

శ్రీలంకకు తిరిగొచ్చిన గోటబయ రాజపక్స

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశానికి తిరిగి వచ్చారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన రాజపక్సే దేశం విడిచి పారిపోయిన ఏడు వారాల తర్వాత లంకకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. రాజపక్సే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు మంత్రులు, రాజకీయ నాయకుల స్వాగతం పలికారు. పచ్చగా ఉన్న లంకను గోటబయి నాశనం చేశారంటూ విమర్శకులు తిట్టిపోస్తున్న తరుణంలో తిరిగి ఆయన లంకకు రావడం సంచలనంగా మారింది. ఐతే రాజకీయనేతల్లో మాత్రం ఆయనపై భక్తి విశ్వాసాలు మాత్రం తగ్గలేదు. ఆయనను అభినందించడానికి నేతలు పోటీపడటమే అందుకు ఉదాహరణ. దేశం యొక్క అపూర్వమైన ఆర్థిక సంక్షోభానికి కారణమని నెలల తరబడి కోపంతో కూడిన ప్రదర్శనల తరువాత, నిరాయుధ గుంపులు అతని అధికారిక నివాసాన్ని ముట్టడించిన తరువాత, జూలై మధ్యలో రాజపక్స సైనిక ఎస్కార్ట్‌తో శ్రీలంక పారిపోయారు.

రోజురోజుకు పెరుగుతున్న శ్రీలంక సంక్షోభాన్ని గాడిలో పెట్టేందుకు ఆయన ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో… ఆయన ఇంటిపై ఆందోళనకారులు దాడులకు దిగడంతో ప్రాణభయంతో గోటబయి దేశాన్ని విడిచిపోరిపోయాడు. 73 ఏళ్ల రాజపక్సే బ్యాంకాక్ నుండి సింగపూర్ మీదుగా కమర్షియల్ ఫ్లైట్‌లో లంకలోకి ప్రవేశించాడు. మొత్తంగా 52 రోజుల ప్రవాసాన్ని ముగించి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి గోటబయపై పడతోంది. థాయ్‌లాండ్ జీవనం నిస్సారంగా ఉందని… జైలు ఖైదీలా ఉండాల్సొస్తోందని ఆయన గత కొద్ది రోజులుగా తన మిత్రులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. రాజపక్సే లంకకు చేరడంతో ఆయనకు భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక సైన్యంతోపాటు, కమాండోలను మోహరించారు.

రాజపక్సే కుటుంబానికి విక్రమసింఘే రక్షణ కల్పిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలుగుప్పిస్తున్నాయ్. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం గోటబయ, ఆయన కుటుంబ సభ్యులకు సెక్యురిటీ అందిస్తోంది. అధ్యక్షపదవి నుంచి తప్పుకోవడంతో ఆయనపై పాత కేసులు తిరగతోడాలని అక్కడ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ్. 2009లో ప్రముఖ వార్తాపత్రిక సంపాదకుడు లసంత విక్రమతుంగే హత్యలో గోటబయ పాత్రపై ఎన్నో అనుమానాలున్నాయ్. రాజపక్సే శిక్ష అనుభవించేందుకు తిరిగిరావాలని కోరుతున్నామంటూ శ్రీలంక యంగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి తరిందు జయవర్ధన అన్నారు. 2009లో జరిగిన విక్రమతుంగే హత్య, తమిళ ఖైదీలను చిత్రహింసలకు గురిచేసినందుకు రాజపక్సే అమెరికా, కాలిఫోర్నియాకోర్టులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.