మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కన్నుమూత
గత కొంత కాలంగా అస్వస్థతగా ఉన్న మాజీ శాసన సభ్యులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో మరణించారు. కొద్ది కాలంగా ఆయన లంగ్ ఇన్ ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అడుసుమిల్లి జయప్రకాశ్ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం విజయవాడలోని మొగల్రాజపురంలో జరుగుతాయి. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కాకాని వెంకటరత్నం అనుచరుడుగా ఆయన ఆంధ్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడైన అడుసుమిల్లి జయప్రకాశ్ 1983లో ఆ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. సమైక్యవాద ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించకుండా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న అడుసుమిల్లి జయప్రకాశ్ ఎన్నో రాజకీయ వ్యాసాలు రాయడమే కాక, టీవీ ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించి మంచి రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఆయన చర్చల్లో పాల్గొన్నారు.

