ఇప్పటి వరకు చేసింది చాలు… ఇక రాజకీయాలకు గుడ్ బై
సంక్రాంతి సాక్షి గా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తాను, తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. బాపట్ల జిల్లా, ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవ చేసినందుకు తనకు తృప్తిగా ఉందన్నారు. ఇంకొల్లుతో తనకున్న అనుబంధం ఉందని అందుకే ఇక్కడ తన మనసులోని మాట బయట పెట్టానని ఆయన అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపులకు దిగటం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. గతంలోని రాజకీయాలకు, నేటి రాజకీయాలకు పొంతన లేదన్నారు. అందుకే తండ్రి, కొడుకులు ఇద్దరూ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో డబ్బు రాజకీయం కాకుండా, సేవ చేసుకునే రాజకీయం వస్తే ఆలోచిస్తామని చెప్పారు. బీజేపీలో కొనసాగుతున్న తన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి గురించి ఆయన ప్రస్తావించలేదు.