బీజేపీలోకి ఆప్ మాజీ నేత
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కైలాశ్ గహ్లోత్ నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్ ఆదివారం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు లేఖ పంపారు. ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే హామీలు అసంపూర్తిగా ఉన్నాయని, పార్టీ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోందని లేఖలో ఆరోపించారు గహ్లోత్. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. బీజేపీకి దిగజారుడు రాజకీయాలు అలవాటేనని, కైలాశ్‌ను సీబీఐ, ఈడీ కేసులతో ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ జైలు నుండి వచ్చాక, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఆతిశీ, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ ఛడ్డాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కేజ్రీవాల్ ఆతిశీకి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడంతో కైలాశ్ అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. కైలాశ్ స్థానంలో ఎమ్మెల్యే రఘువిందర్ షోకిన్‌ను రవాణా మంత్రిగా నియమిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.

