Home Page SliderNational

కాంగ్రెస్‌లోకి కర్నాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ నిరాకరించడంతో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. లింగాయత్ నాయకుడిగా షెట్టర్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. సీనియర్లను గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో హుబ్బళ్లి నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆయన అర్థరాత్రి కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. బెంగళూరులో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, ఆ పార్టీ కర్ణాటక చీఫ్‌ డీకే శివకుమార్‌, సీనియర్‌ నేత సిద్దరామయ్య తదితరులు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత జగదీష్ శెట్టర్‌ మాట్లాడుతూ.. సీనియర్‌ నాయకుడనైన తనకు బీజేపీ టిక్కెట్‌ ఇస్తోందని అనుకున్నానన్నాడు. టికెట్ రాదని తెలియగానే షాక్‌కు గురయ్యానన్నారు. ఎవరూ తనతో మాట్లాడలేదని.. కనీసం ఒప్పించే ప్రయత్నం చేయలేదని వాపోయారు. నేను నిర్మించిన పార్టీ నుండి నన్ను బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు, విధానాలు అంగీకరించి కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు.

షెట్టర్‌ను “వివాదరహిత” వ్యక్తిగా అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. షెట్టర్ చేరిక పార్టీలో ఉత్సాహాన్ని పెంచుతోందని అన్నారు. జగదీష్ శెట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన, ఒంటరిగా గెలవడమే కాదు, ఎక్కువ సీట్లు గెలిపించగల శక్తి ఉన్న వ్యక్తి అని అన్నారు. మే 10న జరగనున్న కర్నాటక ఎన్నికలకు దూరంగా ఉండాలని, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయొద్దన్న సూచనలపై షెట్టర్‌, ఇన్నాళ్లూ ఉన్న బీజేపీని వీడారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పారు. షెట్టర్ గత వారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఢిల్లీ నుండి తనకు పిలుపు వచ్చిందని, యువకులకు మార్గం కల్పించడానికి తన అభ్యర్థిత్వాన్ని వదులుకోవాలని పార్టీ సీనియర్ కార్యకర్త తనను కోరారని చెప్పారు. ఇది తనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. టికెట్ విషయంలో తాను మొండిపట్టుదలగా ఉండేవాడిని కాదని.., పార్టీ తనను అవమానించిందని దుయ్యబట్టారు. లింగాయత్ నాయకుడైన తనపై క్రమబద్ధమైన కుట్ర జరిగిందని ఆరోపించారు.

ఐతే, పార్టీ నుంచి వెళ్లిపోవాలని షెట్టర్ భావించారని, మాజీ సీఎంకు అనేక ఆప్షన్స్ ఇచ్చామన్నారు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప. రాజకీయాల నుండి రిటైర్ అవ్వమని పార్టీ ఎప్పుడూ అడగలేదని యడ్యూరప్ప చెప్పారు. కుటుంబ సభ్యునికి టిక్కెట్‌ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు అనేక ఆప్షన్‌లు ఇచ్చామని, రాజ్యసభ సభ్యుడిగా చేయడం, కేంద్ర మంత్రిని చేయడం లాంటి అవకాశాలు కూడా ఇచ్చిందని చెప్పారు. ఇక హోంమంత్రి అమిత్ షా శనివారం జగదీష్ షెట్టర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. లింగాయత్ వర్గానికి అత్యధికంగా మంత్రి పదవులు ఇచ్చింది బీజేపీయేనని బొమ్మై అన్నారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కర్నాటక బీజేపీ రెండు దఫాలుగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేసింది. 224 మంది సభ్యుల అసెంబ్లీకి సంబంధించి, హుబ్లీ-ధార్వాడ్ స్థానంతోపాటుగా, మరో 12 మంది అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

షెట్టర్ గతంలో ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్‌ను ఓడించి 21,000 ఓట్లకు పైగా గెలుపొందారు. సీనియర్ నేత లక్ష్మణ్ సవాది కూడా గత వారం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. లక్ష్మణ్ సవాడి కూడా యడ్యూరప్పకు విధేయుడుగా, శక్తివంతమైన లింగాయత్ నాయకుడిగా గుర్తింపు పొందారు. జాబితా ప్రకటించకముందే మరో సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనను తప్పించే సూచనలు అందాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మే 10న ఎన్నిక జరగనుండగా, 13న కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.