Andhra PradeshHome Page Slider

ఏపీలో మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు

పెరుగుతున్న ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరిచేందుకు, వైద్యుల కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఇప్పటికే అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీ ఎంఎస్‌ఆర్‌బీ)ని ఏర్పాటు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సిబ్బంది నియామకానికి సంబంధించి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా… ఇకపై వైద్య, ఆరోగ్య శాఖ అనుమతుల కోసం ఎదురుచూడకుండా ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (AP MSRB)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, మండల, జిల్లా స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్త మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం 17 పోస్టులతో బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డుకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని మెంబర్ సెక్రటరీగా, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జేడీ (అడ్మిన్) స్థాయి అధికారిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.