మీ ఫోన్ ఎక్కడ పెట్టారో మర్చిపోయారా..?
స్మార్ట్ ఫోన్.. మన నిత్య జీవితంలో ఇప్పుడు ఇదొక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఖచ్చితంగా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అలాంటప్పుడు మన ఫోన్ కనిపించకపోతే ఎంత టెన్షన్ తీసుకుంటామో మన అందరికీ తెలుసు. నిత్యం మన స్మార్ట్ ఫోన్ ను ఎక్కడ పెట్టామో మర్చిపోతుంటాము. దాని కోసం ఇల్లంతా జల్లెడ పడుతుంటాము. వేరే ఫోన్తో కాల్ చేసి కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటాము. ఒకవేళ ఫోన్ మ్యూట్లో ఉందంటే అంతే సంగతి. దీంతో సమయం వృథా అవ్వడమే కాకుండా.. కాస్త ఆందోళనకు కూడా గురవుతుంటాము.
అయితే మన ఫోన్లో ఓ యాప్ ఉంటే చిటికెలో ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు. ఒక యాప్ సహాయంతో, కేవలం ఈలలు, చప్పట్లు కొట్టడం ద్వారా మీరు మీ ఫోన్ ను గుర్తించవచ్చు. అదే ‘ఫైండ్ మై ఫోన్ క్లాప్, విజిల్’ యాప్. దీన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక రింగింగ్, ఫ్లాషింగ్, వైబ్రేటింగ్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది. ఇది మీ ఫోన్ ను చీకటిలో కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. మీరు చప్పట్లు కొట్టడం (లేదా) ఈల వేయడం చేయాలి. ఇలా చేస్తే ఈ యాప్ ద్వారా మీ ఫోన్ వైబ్రేషన్, ఫ్లాష్ లేదా రింగింగ్ లో ప్రతి స్పందిస్తుంది. ఈ యాప్ ఇంటర్నెట్ లేకుండా పని చేస్తుంది. ఈ యాప్ Android, iOS అందుబాటులో ఉంది.

