Home Page SliderPoliticsTelangana

కేసీఆర్‌కు యావంతా కుటుంబం మీదే తప్ప.. తెలంగాణపై లేదు..

కాళేశ్వరం ప్రాజెక్టు మానవ అద్భుతమన్న కేసీఆర్‌… గత 6 నెలలుగా అక్కడికి చీమను కూడా పోనివ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శలు గుప్పించారు. ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సందర్భంగా.. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏ కార్యక్రమం విజయం సాధించాలన్న కరీంనగర్ మట్టికి మొక్కి, కరీంనగర్ ప్రజలకు దండం పెట్టి ఆశీర్వాదం పొందితే.. అది విజయతీరాన్ని ముద్దాడుతుందన్నారు ఈటల. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని.. దానికి నాంది పలకాలని చెప్పి మనం ఇక్కడ ముగింపు సమావేశం పెట్టుకున్నామన్నారు. కేసీఆర్‌కు యావంతా కుటుంబం మీదే తప్ప.. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై లేదన్నారు ఈటల. తెలంగాణలో ఏ ఒక్కడు కూడా సుఖంగా సంతోషంగా లేరన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే డబ్బులను గ్రామపంచాయతీకి ఒక్క రూపాయి కూడా రాష్ట్రం ఇవ్వడం లేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశాన వాటికలు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మితమవుతున్నాయన్నారు. స్థానిక సంస్థలు గొప్పగా ఎదిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పిన కేసీఆర్‌ వాటిని నిర్వీర్యం చేశారని ఈటల పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రగతిభవన్లో, ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రికి నిరుద్యోగ ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా ? అని ఈటల ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్ అయినా అందరికీ అందరూ భయం నీడలో బతుకుతున్నారన్నారు. ఎవరికీ తృప్తి లేదు.  నీ హయాంలో నీ ఇలాకలో ఏ వర్గం ఏ కులం సుఖంగా లేదని ఈటల స్పష్టం చేశారు.