అమెరికాకు ఫుడ్ డెలివరీ.. కోటిన్నర మాయం..
ముంబయిలో భారీ సైబర్ స్కాంలో ఒక వృద్ధురాలు దారుణంగా మోసపోయింది. అమెరికాలో ఉంటున్న తన కుమార్తె కోసం కొన్ని ఆహార పదార్థాలు కొరియర్‌లో పంపింది. దీని వల్ల ఆమె దాదాపు రూ.కోటిన్నర మోసపోయింది. కొరియర్ పంపిన తర్వాత రోజే ఆ కంపనీ నుండి మాట్లాడుతున్నట్లు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, క్రెడిట్ కార్డులు, అమెరికా కరెన్సీ ఉన్నాయని, ఆమెపై మనీ లాండరింగ్ ఆరోపణలు చేశారు. వీడియోకాల్స్ చేసి, ఉన్నతాధికారుల్లా ఆమెను భయపెట్టారు. పది రోజుల పాటు ఆమెతో ఇలాగే మాట్లాడి ఆమె ఖాతాలలోని రూ. కోటిన్నరను బదిలీ చేసుకున్నారు. తర్వాత తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి కాల్స్‌ను నమ్మవద్దని అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.